నో డౌట్?: మళ్లీ రుణమాఫీ.. విడతలు కాదు.. ఒకేసారి.. గెలుపే టీఆర్ఎస్ ప్రధానాస్త్రం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu
  మళ్లీ రుణమాఫీ : టీఆర్ఎస్ ప్రధానాస్త్రం

  హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ అధినాయకత్వంలో విశ్వాసం సడలుతోందా? మళ్లీ గెలుపుపై అప 'నమ్మకం' ఏర్పడిందా? రైతాంగం వ్యతిరేకిస్తున్నారన్న సందేహాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014 ఎన్నికల ప్రచార బరిలో రైతుకు ఒకేసారి రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. తెలంగాణకు రూ.17 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని గుర్తు చేసి మరీ 'రుణ మాఫీ' పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి నాడు కేంద్రంలో ఆర్థిక మంత్రి పీ చిదంబరం కూడా మద్దతు పలికారు. ఈ రుణ మాఫీ పథకం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని తేల్చేశారు.

  కానీ తర్వాత కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షం 'టీడీపీ అధికారం చేపట్టాయి. రుణ మాఫీపై నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తదితరులు మెటికలు విరిచారు. ఇది అస్తవ్యస్థ ధోరణులకు దారి తీస్తుందన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతులెత్తేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువు దీరిన టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు ఎడతెగని మంతనాలు జరిపి నాలుగు విడుతల్లో రుణ మాఫీ చేస్తామని ప్రకటించాయి.

   విడుతల్లో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ

  విడుతల్లో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ

  తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘రెవెన్యూలోటు' ఏర్పడింది కనుక విడుతల వారీ రుణ మాఫీ చేస్తామని ప్రకటించొచ్చు. కానీ మిగులు రెవెన్యూ ఉన్నదని సాక్షాత్ ప్రస్తుత సీఎం, 2014 ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి తర్వాత ‘ఆర్బీఐ' అడ్డు చెబుతోందని మెలిక పెట్టారు. తాము మాట ఇస్తే ‘వంద'శాతం అమలు చేస్తామని అదేపనిగా ప్రచారంచేసుకునే తెలంగాణ ప్రభుత్వం.. అధికార టీఆర్ఎస్.. విడుతల వారీగా రుణ మాఫీ చేయడం వల్ల వడ్డీ మాత్రమే మాఫీ అయ్యిందే తప్ప, అసలు అలాగే మిగిలిపోయిందన్న వాస్తవాన్ని గుర్తించాలి. అదే జరిగింది. దీన్ని దాటవేసి.. అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు రూ.2 లక్షల' రుణ మాఫీ అస్త్రాన్ని సీఎం కేసీఆర్ తెరమీదకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

   టీఆర్ఎస్ అధినాయకత్వంలో ఆందోళన.. టెన్షన్

  టీఆర్ఎస్ అధినాయకత్వంలో ఆందోళన.. టెన్షన్

  ఇదే క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇంతకుముందే తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్, ఆయన సారథ్యంలోని టీఆర్ఎస్ నాయకత్వం అదే హామీ ఇవ్వడం వ్యర్ధ భరితమే అవుతుందన్న అభిప్రాయం ఉన్నది. అసలు పంట రుణ మాఫీ అస్త్రంతో అధికారాన్ని తిరిగి పొందాలని తలపోస్తున్న సీఎం కేసీఆర్.. 2014లో ఇచ్చినట్లు ఏకకాలంలో ఎందుకు అమలు చేయకపోయారో చెప్పకుండా తాజాగా ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేయాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు అమలులోకి వచ్చే సరికి పరిస్థితులు మరోలా ఉంటాయని రైతులే అంటున్నారు.

   చెక్ లు రూపేణా రుణమాఫీ అమలు తీరుపై సందేహాలు

  చెక్ లు రూపేణా రుణమాఫీ అమలు తీరుపై సందేహాలు

  సీఎం కేసీఆర్ తన ప్రతిపాదనలను సీనియర్ మంత్రులు, ముఖ్య నేతల ముందు ఉంచినట్లు తెలుస్తున్నది. వ్యవసాయ పెట్టుబడి పథకం, రైతు సమన్వయ సమితుల ద్వారా పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడం ద్వారా రాష్ట్రంలోని రైతుల కష్టాలు తీర్చాలని భావిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వార్తలొచ్చాయి. తన మనోగతాన్ని సీఎం కేసీఆర్‌ పలువురు సీనియర్‌ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యుల ముందు ఉంచారు. వారి ఆలోచనలనూ ఆహ్వానించారు. వ్యవసాయానికి పెట్టుబడి పథకం అమలుపై దాదాపుగా 2017 ఖరీప్ దశలోనే ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ గత సీజన్ నుంచే అమలు చేసేందుకు పూనుకోలేదు. 2018 నుంచి అమలు చేస్తామని గొప్పగా ప్రకటించారు. తర్వాతీ దశలో రైతు సమన్వయ సమితుల ద్వారా ‘పెట్టుబడి' పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇది పార్టీ కమిటీులగా మార్చేయడంతో ఎవరికీ నమ్మకాలు లేవు. ఇక చెక్‌ల ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. ఏ మేరకు ఎలా అమలు చేస్తారన్న విషయం మాత్రం గందరగోళం నెలకొంది.

   పూర్తి స్థాయిలో నియామకమే జరుగని సమన్వయ సమితులు

  పూర్తి స్థాయిలో నియామకమే జరుగని సమన్వయ సమితులు

  పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి రైతు సమన్వయ సమితులు పని చేస్తాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. సదరు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కేవలం మండల స్థాయికే పరిమితమైందని తెలుస్తోంది. జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ యత్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తారని, తర్వాత రైతు సమన్వయ సమితి రాష్ట్ర స్థాయి కన్వీనర్‍గా నియమిస్తారని వచ్చిన వార్తలు కొడిగట్టిపోయాయని విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పుడు నియమించిన రైతు సమన్వయ సమితులు ఏం చేస్తున్నాయన్న సంగతి గానీ, వాటి నిర్మాణం తీరు ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పటికీ సందేహం నెలకొంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీతో 34 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందారని మీడియా పేర్కొంది. ప్రభుత్వమూ ప్రకటించుకున్నది. నాలుగు విడతల్లో మాఫీ చేయటం కొంత విమర్శలకు గురైంది. వచ్చేసారి విడతల వారీ కాక ఒకేసారి మాఫీ చేయాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు 2019 ఏప్రిల్‌-మేలో జరగాల్సి ఉంది. ఆలోగా నిర్ణయం తీసుకొని టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో రైతుల వ్యవసాయ రుణం రూ.2 లక్షల వరకు మాఫీ అనే అంశాన్ని పొందుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

   ఉద్యోగుల ఓటు ఖాతాలో వేసుకునేందుకు ఇలా టీఆర్ఎస్

  ఉద్యోగుల ఓటు ఖాతాలో వేసుకునేందుకు ఇలా టీఆర్ఎస్

  తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి నుంచి ఉద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుండటం, సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటం వెరసి ఈసారి పీఆర్‌సీ (పే రివిజన్‌ కమిషన్‌) ద్వారా వారికి భారీ నజరానా అందించటానికి సీఎం కేసీఆర్‌ సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. 2014 జూన్‌ రెండో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన 10వ పీఆర్‌సీ గడువు ఈ ఏడాది జూన్‌ 30న తీరుతోంది. వాస్తవానికి పీఆర్‌సీ కాలపరిమితి ఐదేళ్లు. జూలై 1, 2013 నుంచి అమల్లోకి రావాల్సిన 10వ పీఆర్‌సీ రాష్ట్ర విభజన సమస్యలతో దాదాపు ఏడాది ఆలస్యంగా అమల్లోకి వచ్చిం ది. దీంతో ఆ ఏడాది సమయం పీఆర్‌ఎసీ ప్రయోజనాలను కోల్పోయామనే భావన ఉద్యోగుల్లో ఉంది. ఇక 11వ పీఆర్‌సీ జూలై 1, 2018 నుంచి అమల్లోకి రావాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి పే రివిజన్‌ కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించారు.

  ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా పీఆర్సీ పెంపునకు సీఎం అనుకూలమే

  ఉద్యోగుల అంచనాలకు అనుగుణంగా పీఆర్సీ పెంపునకు సీఎం అనుకూలమే

  పీఆర్‌సీ కమిషనర్‌ నియామకంతోపాటు, గడువు కంటే ముందే నివేదిక తెప్పించుకోవాలని, జూలై 1, 2018 నుంచి 11వ పీఆర్‌సీ అమల్లోకి వచ్చే విధంగా చూడాలని కోరారు. 10వ పీఆర్‌సీలో ఇంటీరియమ్‌ రిలీఫ్‌ (ఐఆర్‌) 29 శాతం, ఫిట్‌మెంట్‌ 43 శాతం ఇచ్చారు. తాజా ధరల సూచీ ప్రకారం ఫిట్‌మెంట్‌ 65 శాతం, దానికి అనుగుణంగా 35 నుంచి 40 శాతం వరకు ఐఆర్‌ ఇవ్వాలని ఇప్పటికే ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లోగడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది కాలంపాటు పీఆర్‌సీ ప్రయోజనాలను నష్టపోవటం, సాధారణ ఎన్నికల ముందు ఇదే చివరి పీఆర్‌సీ కావటంతో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ విషయంలో కొంత ఉదారంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగులకు ఈసారి 11వ పీఆర్‌సీ ద్వారా వారి అంచనాలకు తగినట్లుగానే ఫిట్‌మెంట్‌, ఐఆర్‌ ఉండబోతున్నాయనే సంకేతాలు అధికార పార్టీ వర్గాల కథనం.

  సీపీఎస్ లో సవరణలకు కేంద్రం సుముఖం ఇలా

  సీపీఎస్ లో సవరణలకు కేంద్రం సుముఖం ఇలా

  కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీంపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయాలని కేంద్రానికి సిఫారసు చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీపీఎస్ కింద కేవలం రూ.2000 పెన్షన్ మాత్రమే వస్తుండటంతో అన్ని వర్గాల నుంచి ఆందోళనలు, అభ్యర్థనల రూపంలో వెళ్లిన ప్రతిపాదనల నేపథ్యంలో కేంద్రం కూడా పునరాలోచించినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా కనీస పెన్షన్ రూ.8000, గరిష్ఠంగా రూ.20వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

  అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని యోచన

  అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని యోచన

  ఈ క్రమంలో సీపీఎస్‌లో మార్పులు తమ ఘనతే అని చాటుకునేందుకా? అన్నట్లు టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అందుకే అసలుకే సీపీఎస్ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాయటానికి సిద్ధమవుతోందని తెలిసింది. కాంగ్రెస్‌ హయాంలో సీపీఎస్‌ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో సీపీఎస్‌ పరిధిలోకి వచ్చే దాదాపు 1.25 లక్షల మంది ఉద్యోగులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా సీపీఎస్‌ విధానాన్ని తప్పుపడుతోంది. పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్యోగుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా, దీనిపై సభలో చర్చించి సీపీఎస్‌ రద్దు కోరుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TRS high command have some doubt to won next assembly and loksabha elections. In this context CM and TRS Chief Kalwakuntla Chandra Shekhar Rao planned to crop loan waive once again upto Rs.2 lakhs one time settlement. This idea he had discussed with senior ministers and party seniors and close associates.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X