కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!
కొండా సురేఖ పై చర్యలకు రంగం సిద్దం అవుతోంది. తాజా వివాదం వేళ ఇక ఉపేక్షించకూడదని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో కొండా సురేఖ తో పాటుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతల పైనా చర్యలకు సిద్దం అవుతోంది. క్రమశిక్షణ తప్పితే కఠినంగానే ఉంటామనే సంకేతాలు ఇచ్చేలా నిర్ణయాల పై కసరత్తు జరుగుతోంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం.. కాంగ్రెస్ లో ఇప్పుడు కొండా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీఎం రేవంత్ పైన మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ పదే పదే విమర్శలు చేస్తుండడంపై అధిష్ఠానం సీరియస్ గా ఉంది. తన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా కొండా సురేఖ అదుపు చేయకపోవడంపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలోనూ సురేఖ సినీ నటులపై, సొంత పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లెక్కల్లోకి వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉందని, తద్వారా సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలనుకుంటోందని ఢిల్లీ నేతల సమాచారం. అయితే కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించాలా? అన్న దాని పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం రేవంత్ కు ఈ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం.

హైకమాండ్ తో రేవంత్ చర్చలు
గతంలోనూ కొండా సుస్మితా పటేల్ గతంలోనూ సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. హైడ్రామా సృష్టించారు. అయితే అప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ జోక్యం చేసుకుని మంత్రి సురేఖతో మాట్లాడారు. ఆ తర్వాత తన కుమార్తె చేసిన వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇవ్వటం.. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, అందుకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ కొండా సురేఖ వివరణ పంపారు. అయితే ఆ వివరణలో ఎక్కడా కొండా సుస్మిత వ్యాఖ్యలను ఆమె ఖండించలేదు. ఈ వ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చాక సురేఖ.. ఆయనను కలిసే అవకాశం ఉంది. సురేఖ పైన వేటు వేస్తే ఆ స్థానంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. దీంతో.. రేవంత్ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications