కోదండరామ్ కు పదవిపై రేవంత్ ప్రకటన - ఓయూ కు మళ్లీ వస్తా, ఈ సారి ఇక..!!
ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మళ్లీ ఓయూకు వస్తాను.. సెక్యూరిటీ లేకుండా వస్తాను.. నిరసన తెలిపినా ఏమీ అనను.. అన్నింటికీ సమాధానం చెప్పే చిత్తశుద్ది ఉంది అని రేవంత్ వ్యాఖ్యానించారు. 15 రోజుల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ను చట్ట సభకు పంపుతానని ప్రకటించారు. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటని నిలదీసారు. HCU లో ఎలాంటి మృగాలు లేవని.. మానవ రూపంలో మృగాలు అన్నీ ఫాం హౌస్ లోనే ఉన్నాయని రేవంత్ విరుచుకుపడ్డారు.
కోదండరామ్ కోసం
ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి పై తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోదండరామ్ కు వ్యతిరేకంగా సుప్రీంకు వెళ్లారని.. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. 15 రోజుల్లో కోదండరామ్ ను తిరిగి చట్టసభలకు పంపుతానని రేవంత్ ప్రకటించారు. తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని చెప్పుకొచ్చారు.

ఓయూ కోసం నిలబడతా
కొందరు వ్యక్తులు.. ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు. త్వరలోనే తాను మరోసారి ఓయూకు వస్తానని.. ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ పెడతానని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ వద్దని స్పష్టం చేసారు. విద్యార్ధులు నిరసనకు దిగినా వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ది తనకు ఉందన్నారు. అక్కడే సభలోనే ఓయూకు సంబంధించి జీవోలు జారీ చేస్తామని రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను డ్రగ్స్, గంజాయి పట్టి పీడిస్తున్నాయని ఆవేదన చెందారు.












Click it and Unblock the Notifications