తెలంగాణ ఉద్యమం అంటే ఒక కుటుంబం కాదు!
తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం పోరాటం వల్లే ఏర్పడలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన 'విజయ తెలంగాణ' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ జలవిహార్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం రేవంత్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాల్సి ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నా.. ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారంటూ.. పరోక్ష్ంగా కేసీఆర్ కుటుంబంపై వ్యాఖ్యలు చేశారు. దేవేందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని రేవంత్ అన్నారు.

గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు దేవేందర్ గౌడ్ ఉద్యమం చేపట్టారన్నారు. దేవేందర్ గౌడ్ పాదయాత్ర వల్లే ఆనాడు ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే ఇప్పుడు టీఎస్‌ను టీజీగా మార్చామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే షార్ట్ కట్‌లో 'టీజీ' అని దేవేందర్ గౌడ్ గుండెల మీద రాసుకున్నారని రేవంత్ గుర్తు చేశారు.
జలవిహార్ లో మాజీ హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..@revanth_anumula #DevenderGoud #Telangana pic.twitter.com/MI8GkwzUSi
— ManaCongress (@ManaCongress_) February 14, 2025
ఉద్యమకారులకు గుర్తుగానే తమ ప్రభుత్వం వచ్చాక టీజీగా మార్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గత పదేళ్లు నివురుగప్పిన నిప్పులా ఉందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, అలాంటి ఉద్యమ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్న ప్రభాకర్, ఎంపీ లక్ష్మణ్, పలువురు నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications