రైతులకు రేవంత్ గుడ్ న్యూస్: 18 నుంచే రుణమాఫీ అమలు: రూ. లక్షలోపు
Revanth Reddy: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రైతు రుణ మాఫీకి సంబంధించిన నిర్ణయం అది. ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్.. దాన్ని ఇంకా ముందుకు జరిపారు. ఈ నెల 18వ తేదీ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు.
తొలి విడత..
తొలివిడతగా ఈ నెల 18వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు పంట రుణాలను మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైనా స్పష్టత ఇచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల పంట రుణాల మాఫీ వర్తిస్తుందని చెప్పారు.

కుటుంబాన్ని గుర్తించడానికే..
కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రంగానికి ఆదేశించారు.
తొలివిడత రుణ మాఫీ అమలు కాగానే రైతు వేదిక వద్ద లబ్దిదారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు సంబరాలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.
బ్యాంకర్లకు వార్నింగ్..
రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. రుణ మాఫీ కోసం విడుదలైన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేయడం అంటూ జరిగితే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
చివరి లబ్దిదారు వరకూ..
సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో సుధీర్ఘ సమీక్షా సమావేశంలో రుణ మాఫీ అమలు గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు చిట్ట చివరి లబ్దిదారుల వరకు చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఆరు హామీల అమలుపై..
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులై ఉండీ పథకం వర్తించకపోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నంబర్, విద్యుత్ సర్వీసు నంబర్లు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు.
పెండింగ్ దరఖాస్తులపై..
పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా అవన్నీ పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంటుందని డెడ్‌లైన్ విధించారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులు ఉన్నారని, దీన్ని కోటికి చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.
డిజిటల్ ప్రొఫైల్..
ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నిఘా ఉంచాలని అన్నారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చేయాలని, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications