దానం, కడియంకు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకులు పలువురు వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కొద్దిరోజులుగా చేరికలు జోరుగా సాగుతున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. అనేకరకాల హామీలతోపాటు కొన్ని ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక పార్టీ గుర్తుమీద గెలుపొంది మరో పార్టీలోకి చేరేవారు తమ తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి చేరేలా చట్టసవరణ తీసుకురావడం అనేది కూడా ఈ ప్రతిపాదనల్లో ముఖ్యమైనది.
ఆయా నాయకులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత మరో పార్టీలోకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరికి సవాల్ విసురుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు తమ పదవులకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఒకరకంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డిని సంకటస్థితిలో పడేసింది. రేవంత్ కాంగ్రెస్ మానిఫెస్టోనే ఫాలో అవుతారని, వీరిద్దరిచేత రాజీనామా చేయించే అవకాశం ఉందంటున్నారు.

దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి స్పీకర్ తో అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ నాయకులు పలువురుగా వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరిలో ఎంతమంది ఎన్నిరోజులు అధికార పార్టీలో ఉంటారో అర్థం కావడంలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ పార్టీ తరఫున గెలుపొందినా అధికార పార్టీలో మాత్రమే కొనసాగే ప్రజాప్రతినిధులు ఉంటారని, అటువంటివారిని ఏ రాజకీయ పార్టీ ఆదరించకూడదని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications