ఉత్తర తెలంగాణ జీవనాడిపై కీలక ప్రతిపాదనలు
తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో సమావేశమైంది. ముంబై సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎలాంటి వివాదం లేకుండా
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై ఇందులో సమగ్రంగా చర్చించారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ సైతం ఇచ్చారు. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాల ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఎలాంటి వివాదం లేకుండా ఈ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టాలనే విషయంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు. సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందట్లేదని గుర్తు చేశారు.
నక్సలిజం వంటి సమస్యలు
ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఆ ప్రాంతానికి సాగునీరు అందించడానికి 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్ బీ చవాన్ మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. అయిదు దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని, అయినప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేకపోయామని పేర్కొన్నారు.
గ్రావిటీ ద్వారా నీటి తరలింపు
2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒక ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమని, అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రైతులకు పరిహారం
ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే ప్రత్యామ్నాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి తన ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమలులో ఉన్న భూసేకరణ నిబంధనలు, రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
వెనుకబడిన అటవీ ప్రాంతం
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ- మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. ఒకప్పటి హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని, అక్కడి గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ తో ప్రత్యేక అనుబంధం
ఈ ప్రతిపాదనలపై దేవేంద్ర ఫడ్నవిస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆదిలాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉందని, తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని తెలిపారాయన. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను పునః పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అభ్యంతరం లేదు
సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలించాలని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల సంఘం తన పరిధిలో అవసరమైన అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు.
సమగ్రంగా అధ్యయనం
ఈలోగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఫడ్నవీస్ ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యతపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. ముంపు ప్రభావం, ప్రభావిత భూముల విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల అంచనాలను పరిశీలించాలని సూచించారు.
కార్యాచరణ ప్రణాళిక
ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలని దేవేంద్ర ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు జరపాలని, తదుపరి సమావేశాల నిర్వహణ, ప్రాజెక్టుపై ముందుకు వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇద్దరు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications
