రైతుల ఖాతాల్లో నిధులు - కొత్త రేషన్ కార్డుల జారీ షురూ..!!
తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డు సాధిస్తోంది. ఒకే రోజు నాలుగు పథకాల అమలు ప్రారంభిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమానికి శ్రీకారం చుడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ నారాయణ పేట జిల్లా వేదికగా పథకాలను ప్రారంభించనున్నారు. రైతుభరోసా నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కొత్త రేషన్ కార్డులు .. ఇందిరమ్మ ఇళ్లు.. ఆత్మీయ భరోసా నేటి నుంచి అమలు కానుంది. దీంతో, రైతులు - మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు సర్వం సిద్దమైంది.
ఒకేసారి నాలుగు పథకాలు
ముఖ్యమంత్రి రేవంత్ నేడు నాలుగు సంక్షేమ పథకాల అమలు ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కోస్గి మండలం, చంద్రవంచ గ్రామానికి చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహిం చింది. ప్రజాపాలన, సమగ్ర సర్వే సందర్భంగా వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి.. జాబితాలను సిద్ధం చేశారు. అనర్హుల ఏరివేత, జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ప్రభుత్వ కసరత్తు
రైతుల ఖాతాల్లో రూ 12 వేలు రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. గ్రామ, బస్తీ సభల ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసారు. కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు. నేటి నుంచి ఈ నాలుగు పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. పథకాల అమలు విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే, ఈ పథకాల అమలు కోసం వస్తున్న ఒత్తిడితో వీటిని నిరంతరం కొనసాగించే ప్రక్రియగా ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కోసం నిరంతరం దరఖాస్తుల స్వీకరణ
ఉంటుందని మంత్రులు వెల్లడించారు.
నేటి నుంచి అమలు
ఇక, రైతుబంధు నిధుల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అనర్హులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన భూములకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భువన్ యాప్ సాయంతో సర్వే నిర్వహించింది. సాగు రైతులకు మాత్రమే ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. అయితే సాగులో భూమి ఉన్నా లేకున్నా.. సాగుకు యోగ్యంగా ఉంటే మాత్రం వాటిని రైతుభరోసా కింద అర్హత ఉన్నట్లు గుర్తించారు. దీంతో, నేటి నుంచి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ నాలుగు పథకాల తో పెద్ద సంఖ్యలో లబ్దిదారులకు మేలు జరగనుంది.












Click it and Unblock the Notifications