నీళ్లు.. నియామకాలు: అతిపెద్ద సెంటిమెంట్ అదే- రేవంత్ భావోద్వేగం
Revanth Reddy: తెలంగాణ నీటిపారుదల శాఖకు కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాల గురించి వివరించారు. వారికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని, ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని కోరారు.

కొలువుల పండుగలో భాగంగా నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లలకు జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
గత 40- 50 సంవత్సరాలుగా తెలంగాణ వాటాగా అందాల్సిన నీళ్లు అందలేదని, పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కూడా సకాలంలో అందుబాటులో రాకుండాపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు. నీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ సమాజానికి నీళ్లు ఎంత అవసరమో.. దాని కోసం ఎంతగా పరితపించామో.. ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైందో ఆ నీళ్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టాయని రేవంత్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. అందుకే నీటి పారుదల శాఖకు తన ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశాబ్దాల పాటు వాయిదా పడిన ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత పదేళ్లల్లో కూడా పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని, ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయని అన్నారు.
తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లేనని, అందుకే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నీటి ప్రాజెక్టులను భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాధ్యత ఇంజినీర్లుగా మీపై ఉందని కొత్త ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు.
ఇది- నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రజల భావోద్వేగంగా భావించాలని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి వారికి పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదని అన్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో ఇదే వేదిక నుంచి 738 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జూనియర్ అసిస్టెంట్లకు నియామాక పత్రాలు అందించి భుజం తట్టామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు 443 ఉద్యోగాలను నియమించామని ఆయన వ్యాఖ్యానించారు. 14 నెలల కాలంలో ఈ ఒక్క శాఖలోనే 1,121 మందిని నియమించామంటే దీనికి తమ ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడామని, ప్రజా ప్రభుత్వంలో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగ నియామకాలను చేపట్టామని చెప్పారు. 14 నెలల్లో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ వివరించారు. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించామని, మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులను తీసుకొచ్చి, రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని చెప్పారు.
యువతకు విద్య, ఉద్యోగాల కల్పించాలనేది తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications