ఒక్క రూపాయీ ఇంటికి తీసుకుపోనూ..!
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1532 మందికి సీఎం రేవంత్ చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాలు చేపడుతున్నవారికి అభినందనలు తెలిపారు.కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడల్లో కూడా యువత రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య కూడా ఒక ప్రధాన కారణమన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలను ఊడగొడితేనే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 50వేలకుపైగా నియామకాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో సంతలో సరుకులా ప్రశ్నపత్రాలు అమ్మారని విమర్శించారు. తనతోపాటు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఈ స్థాయికి వచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్నారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యాశాఖకు రూ. 21,650 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
గత ప్రభుత్వంలో కాళేశ్వరం కడితే.. అది కూలిపోయి కూలేశ్వరం అయ్యిందంటూ సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీ నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను ఎవరి పిల్లలో ప్రాణాలు త్యాగాలు చేస్తేనో.. అవాస్తలు చెప్పే అధికారంలోకి రాలేదని సీఎం రేవంత్ చెప్పారు.
Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Distribution of appointment letters to newly recruited candidates for the post of Junior Lecturer in Intermediate and Polytechnic Colleges at Ravindra Bharathi, Hyderabad https://t.co/SUOAtnYa8n
— Telangana CMO (@TelanganaCMO) March 12, 2025
తాను ఒక్క రూపాయీ ఇంటికి తీసుకుపోనని స్పష్టం చేశారు. తనకు సంపాదించాలనే కోరిక లేదన్నారు. తన జీతం కూడా రాష్ట్రం కోసమే ఖర్చు పెడతానని అన్నారు. వచ్చే 20 ఏళ్లు తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేస్తానని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నైపుణ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్య పూర్తయిన విద్యార్థులకు వెంటనే వివిధ రంగాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
విద్యతోపాటు క్రీడలకు కూడా విద్యార్థులు ప్రాధాన్యత ఇచ్చి ఆయా రంగాల్లో రాణించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ వేడుకలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహించేందుకు హైదరాబాద్‌కు అన్ని అర్హతలున్నాయని సీఎం చెప్పారు.
విద్యపై చేసేది ఖర్చు కాదు..
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నిలిచిన నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి మాకుంది. ఒక్క ఏడాది కాలంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలోనే మరొకటి లేదు. ఇది నాకు ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని సీఎం రేవంత్ చెప్పారు.
మీకు వచ్చిన ఉద్యోగం కుటుంబ భవిష్యత్తే కాదు, భవిష్యత్తు తరాలను కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి. దేశ భవిష్యత్తు విద్యా శాఖతో ముడిపడి ఉంది. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉంది. విద్యా శాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు. భవిష్యత్ తరాలకు పెట్టుబడి అని సీఎం వ్యాఖ్యానించారు.
విద్యలో కేరళతో పోటీ పడి రాణించాల్సిన తెలంగాణ ఈరోజు కింది నుంచి రెండో మూడో స్థానంలోకి పడిపోయిందంటే తెలంగాణ జాతికి అవమానం. వాస్తవాలను అంచనా వేసుకుని, వాస్తవాల మీద చర్చించుకుని భవిష్యత్తుకు ప్రణాళికలను తయారు చేసుకున్నప్పుడే తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు సీఎం రేవంత్.
ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో అత్యుత్తమ ప్రమాణాలు, అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికీ అంతగా అనుభవం లేని ప్రైవేటు స్కూళ్లల్లో ఎక్కువ మంది పిల్లలు ఎందుకు చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లతో ఎందుకు పోటీ పడలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలన్నారు సీఎం రేవంత్.ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఇంత ఖర్చు పెడుతున్నా ఫలితాలు సాధించలేకపోతే వృధా. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. చర్చించుకోవలసిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ అన్నారు.
అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేడెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నాం. అందుకోసం 11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. ప్రతి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవుతున్నా, స్కిల్స లేని కారణంగా వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. వీటన్నంటిని గమనించే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ చెప్పారు.
క్రీడలు దేశ ప్రతిష్టను పెంచుతాయి. దేశంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ క్రీడల్లో రాణించలేకపోతున్నాం. కోట్లాది ప్రజలున్నా ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోతున్నాం. విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల్లో చేరిన తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి క్రీడాకారులను తయారు చేయాలి. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications