RRRపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తరం పనులకు టెండర్లు పిలవాలన్నారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్ఏఐని సీఎం రేవంత్ కోరారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఎంత ఆర్థిక భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

ఇది ఇలావుండగా, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక ఫోరం(WEF) అధ్యక్షుడు బోర్గ్ బ్రెండేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం.. సీ4వఐఆర్ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్ ప్రారంబం కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలుంటాయన్నారు. డబ్ల్యూఈఎఫ్ తో భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చన్నారు. ప్రజారోగ్యం, సాంకేతికత, మెరుగైన జీవితం కల్పించడం వంటి లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.
మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం పలువురు ప్రముఖులను కలిశారు. మెడ్ ట్రానిక్స్ సీఈవో, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, యూఎన్ ఎఫ్ పీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేం, దావోస్ అల్జీమర్స్ ఛైర్మన్ జార్జ్ రాడెన్ బర్గ్, తదితరులను కలిశారు.
కాగా, దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది.
'తెలంగాణలో పెట్టుబడి పెట్టండి' అనే పేరుతో పెవిలియన్‌ను రూపొందించారు. సృజనాత్మక, సంప్రదాయాల కలయిక (వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్) ట్యాగ్ లైన్‌ను ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సంసృతి, సాంకేతిక సృజనాత్మకతలను ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్తో వాల్ డిజైనింగ్ చేశారు. పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, ప్రపంచంలోనే అపార అవకాశాలున్న ప్రాంతం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications