మాట నిలబెట్టుకుంటున్నాం: మహాలక్ష్మీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ మహాలక్ష్మి పథకాన్ని , అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల చేయూత పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ లతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, సిఎస్ శాంతికుమారి సమక్షంలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో పదిలక్షల రూపాయల చేయూతను ప్రారంభించడంతో పాటు, స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ జెండా ఊపగా మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సులను ప్రారంభించారు.

ఇకపై రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి ఈ పథకం ద్వారా వీలు కలుగుతుంది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఉన్న ఆసుపత్రులలో నిరుపేదలకు పదిలక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్య సహాయం అందనుంది.
ఈ రెండు పథకాలను ప్రారంభించిన క్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం కృషి చేసిన ఉక్కుమనిషి సోనియాగాంధీ పుట్టినరోజు బహుమతిగా దీనిని అభివర్ణించారు. ఇచ్చిన మాటను నెరవేర్చి, మహిళా లోకానికి ఆదర్శంగా నిలబడ్డ మాతృమూర్తి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీలను నెరవేరుస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం చేయడంతో పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల సహాయం అందిస్తున్నట్టు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ఆరు హామీలను ఇచ్చి, నెరవేరుస్తామని మాట ఇవ్వడం జరిగింది.తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లోగా నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులో ఆడపిల్లలకు ఉచిత ప్రయాణాన్ని లాంచనంగా ఈరోజు ప్రారంభిస్తున్న మహిళా మంత్రులు, మహిళా శాసనసభ్యులతో పాటు, తాము కూడా ప్రయాణం చేసి ట్యాంక్ బండ్ మీద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆయనకు నివాళులర్పించి , తిరిగి శాసనసభకు వచ్చి మిగతా కార్యక్రమాలలో పాల్గొంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.
LIVE : Launching of Rajiv Arogya Sri and Mahalakshmi schemes https://t.co/KvkYdPoB8o
— Telangana Congress (@INCTelangana) December 9, 2023
ఏ విధంగా అయితే తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో, అదేవిధంగా తామిచ్చిన గ్యారెంటీ లను అమలు చేసి అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుందన్నారు. ఆ మాట కోసం అహర్నిశలు కృషి చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications