రైతు ఖాతాల్లో నగదు జమ: కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ సెటైర్లు
ఇచ్చిన హామీలను తాము అమలు చేస్తున్నామని.. ఇందుకు ప్రజలకు తమకు అండగా ఉండాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజా పాలనలో మరో ముందడుగు వేస్తూ ఈ నాలుగు పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. నేటి రాత్రి నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని సీఎం రేవంత్ చెప్పారు.

ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు సీఎం రేవంత్. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు, అమెరికాలో చదివిన కేటీార్‌కు రేషన్ కార్డులు ఇవ్వాలని తెలియదా? అని ప్రశ్నించారు. రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారన్నారు.పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు.
భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉందని సీఎం రేవంత్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్‍ను ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసింది.. దేశమంతట రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు సీఎం రేవంత్. పేదలకు ఇళ్లు అంటే వైయస్సార్ గుర్తుకు వస్తారన్నారు. పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉద్యోగాలిచ్చామని తెలిపారు. కాళేశ్వరం కూలినా లక్ష ఎకరాలకు పైగా పంట పండిందన్నారు. అయినా, రైతులందరికీ బోనస్ గా రూ. 500 ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు.
తాము ఫాంహౌస్‌లో ఉండి పాలన చేయడం లేదని మాజీ సీఎంను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తమకు ప్రజలే రాజులు అని.. ప్రజల దగ్గరికే మంత్రులు, అధికారులు వస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అధికారం ఉంటేనే వస్తారా? అని నిలదీశారు.
కేసీఆర్ ఇంట్లో అందరికీ పదవులు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. తన కుటుంబంలో మాత్రం తాను ఎవరికీ పదవులు ఇవ్వలేదని చెప్పారు.
కేసీఆర్ ఎలాగైనా కొడంగల్‌ను ముంచాలని చూస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమల స్థాపన కోసం అధికారులు వెళితే.. దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గుడులు, బడులకు రేవంత్ కుటుంబం భూములు, డబ్బులు ఇచ్చిందని చెప్పారు. తాము ఎవరి దగ్గర డబ్బులు ఆశించలేదన్నారు.
కొడంగల్‌లో ఏ సమస్య వచ్చినా.. తన సోదరుడు తిరుపతి రెడ్డి ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ పదవి ఆశించకుండా తిరుపతి రెడ్డి ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకొందామని పిలుపునిచ్చారు. చిల్లర వివాదాలు వద్దన్నారు. పదివేల కోట్లను పేద రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. పథకాలు అమలు చేయాలంటే ప్రజలంతా అండగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications