ఒక భూతాన్ని బంగాళాఖాతంలో విసిరికొట్టాం
అవినీతికి పాల్పడతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడతారంటూ జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు.
రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులకు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని వారితో ప్రతిజ్ఞ చేయించారు.

పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామ పాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందుకోసం 5,000కు పైగా గ్రామ పాలనాధికారులను నియమించామని అన్నారు. సాదా బైనామాకు సంబంధించి ఎనిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యోగం.. ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్యగా భావించాలని, భావోద్వేగంతో కూడుకుని ఉన్నదని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించడానికి వీలులేకుండా వీఆర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అధికారాలను తప్పించారని అన్నారు.
ఫలితంగా సమాధానం చెప్పలేక ఆయా ఉద్యోగులు సమాజంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో ధరణి అనే ఒక భూతం పట్టి పీడించిందని రేవంత్ చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు. ధరణి అనే మహమ్మారిని అంతం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని వేశామని, భూభారతి 2025 చట్టం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశామని పేర్కొన్నారు.
భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని, భూమిపై జరిగిన ఏ పోరాటమైనా భూమి చుట్టే సాగాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజాం, రజాకార్లు, పెత్తందార్లను దిగంతాలకు తరిమికొట్టి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగిన చరిత్ర తెలంగాణకు ఉందని చెప్పారు. అలాంటి భూసంబంధిత రెవెన్యూ శాఖలో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా చూడాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications