అక్రమ నిర్మాణాలపై సెలబ్రిటీలకు, ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక!
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని కూల్చివేసేది తధ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నేడు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులను, నాలాలను ఆక్రమించుకోవడంతో వరదలు వచ్చి పేద ప్రజల ఇళ్ళు నీట మునుగుతున్నాయని, చెరువులు, నాలాలలో ఆక్రమణలను తొలగించేందుకే హైడ్రా వ్యవస్థను తెచ్చామన్నారు.
వారికి రేవంత్ హెచ్చరిక
కొందరు ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్ లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అటువంటివారు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని హితవు పలికారు. అలా కాదంటే హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలకు పాల్పడతారని హెచ్చరించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం
అటువంటి నిర్మాణాలపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్య లేదని, న్యాయస్థానాలలో కూడా పోరాటం సాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్లో చెరువులను, నాలాలను పూర్వస్థితిలోకి తీసుకురావడానికి తాము కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆక్రమణలను తొలగించి మూసి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం
మూసి పరివాహక ప్రాంతంలోని 11,000మంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. నాలాల ఆక్రమణలతోనే వరదలు ఉప్పెనలా వస్తున్నాయని దీంతో నష్టపోతుంది మాత్రం పేద ప్రజలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు . ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని సూచించారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3వ తేదీన ప్రజాపాలన మొదలైందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే ఉద్యోగాల కల్పన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 30 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించామని, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ పై ఎటువంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఇక నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేశామని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కీలకంగా పనిచేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.
డ్రగ్స్ పై ఉక్కుపాదం.. వారికి వార్నింగ్
త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారిని లేకుండా చేయడానికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని రైతులు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లేలా చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన మొత్తం ప్రసంగంలో సెలబ్రిటీలకు, బడా బాబులకు ఆక్రమణల విషయంలో తీవ్ర హెచ్చరికను జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications