కెసిఆర్ 200కేసులు పెడితేనే భయపడలేదు.. మోదీ కేసులకు భయపడతానా? రేవంత్ రెడ్డి మాటలదాడి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అన్ని లోక్సభ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కేంద్రంలోని బిజెపిని, బిఆర్ఎస్ ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో నిర్వహించిన జన జాతర సభకు మంత్రి సీతక్కతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి హాజరయ్యారు.
బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు పోవడం ఖాయం
ఆసిఫాబాద్ కేంద్రంలో ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు పోవడం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు . కులగణన చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి కి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కోసమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ మార్పుపై మాట్లాడుతున్నానని, అందుకే నాపై కేసులు పెట్టారని అన్నారు.

మోదీ కేసులకు భయపడతానా ?
కెసిఆర్ 200 కేసులు పెడితేనే భయపడలేదని, ఇప్పుడు మోదీ కేసులకు భయపడతానా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ సుల్తానులు తెలంగాణ పై దాడి చేయాలనుకుంటున్నారని వారి ఆటలు సాగవు అన్నారు. బీజేపీ రిజర్వేషన్లు తీసివేస్తుందనడానికి సాక్షాలు ఉన్నాయన్నారు. 1881 నుండి దేశంలో జనగణన జరుగుతుందని, 2021లో బిజెపి ఆ పని చేయలేదన్నారు. దీనికి కారణం జనగణనతో పాటు కులగనన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడమేనన్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
అదే జరిగితే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని బిజెపి అభిప్రాయం అన్నారు. ఆర్ఎస్ఎస్, బిజెపి కలిసి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో తీసుకువస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కెసిఆర్ జైల్లో పెట్టాడని, ఇప్పుడు మోడీ ఆ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మోదీ సర్కార్ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తామని చెప్పామని తప్పనిసరిగా దానిని నెరవేరుస్తామన్నారు. మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ గాడిద గుడ్డును ప్రజలకు చూపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ఏది బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదని, రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మోదీ, కేసీఆర్ ఇద్దరూ అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ సిమెంటు ఫ్యాక్టరీలు లాంటివి ఏవి తీసుకురాలేదని, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని చెప్పి, ప్రజలతో అదే విషయాన్ని అనిపించారు రేవంత్ రెడ్డి. పది సంవత్సరాలు మోదీ, కేసీఆర్ ఇద్దరూ అధికారంలో ఉన్నప్పటికీ అదిలాబాద్ కి చేసిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications