గణేశ్ ఉత్సవాల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
గణేష్ ఉత్సవాల నిర్వహణకు భాగ్యనగరం సిద్దం అవుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. 25వ తేదీన నిమజ్జనం కు నిర్ణయించారు. ఇప్పటికే మున్సిపల్ - పోలీసు అధికారులు నిర్వాహకులతో భేటీ అయ్యారు. కీలక సూచనలు చేసారు. కాగా.. ఈ ఉత్సవాల పైన ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భాగ్యనగరంలో గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పండుగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సహాయ సహకారాలు అందించాలన్నారు. మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్దేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత వహించాలని సూచించారు. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు. నిర్వాహకులు మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే ఆ వివరాలను స్థానిక కమిషనరేట్‌కు అందించాలని విజ్ఞప్తి చేసారు. ఊహించని పరిణామాలు జరిగినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మల కుంటలు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.













Click it and Unblock the Notifications
