అడ్డంకులు తొలిగిస్తాం, అండగా నిలుస్తాం - రేవంత్..!!
ప్రపంచ దేశాలకు ధీటుగా పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేసారు. నూతన ఎమ్మెఎస్ఎంఈ 2024 పాలసీని రేవంత్ ఆవిష్కరించారు. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
కొత్త ప్రతిపాదనలు
ఎంఎస్ఎంఈ రంగానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఈ రంగం ప్రధానంగా 6 అడ్డంకులను ఎదుర్కుంటున్నాయన్నారు. భూమి, మూలధన లభ్యత, ముడిపదార్థాల అందుబాటు, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌకర్యం లేకపోవడం, మార్కెట్‌లతో అనుసంధానం కాలేకపోవడం వంటి అంశాలు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లుగా పేర్కొన్నారు. ఈ అడ్డంకులను తొలగించడానికి 40 ప్రతిపాదనలు చేసినట్లు రేవంత్ వెల్లడించారు.

అడుగులు వేస్తున్నాం
పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పటిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరిలా ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం వేగంగా అడుగులు వేస్తున్నామని, పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్ నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నిర్మించతలపెట్టిన ప్రతి పారిశ్రామిక పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం రిజర్వు చేయనున్నట్లు రేవంత్ వివరించారు.
తాజా నిర్ణయాలు
వచ్చే 5 ఏళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ట్రిపులార్ మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతున్నట్లు చెప్పారు.10 పార్కులలో 5 ఎంఎస్ఎంఈలు ఉంటాయని.. వీటిలోని ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నట్లు వివరించారు. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా అమలుపరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications