స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ప్రక్షాళన షురూ..
పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని తెలిపారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి..పార్టీ నేతలు ఐక్యంగా పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
"పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోతాం. పార్టీ, ప్రభుత్వం జోడేదుల్లా పనిచేయాలి. 18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్థ వంతంగా తీసుకెళ్లగలుగుతాం. పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలి. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పని చేయాలి. మరో సారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేలా అంతా పని చేయాలి" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పార్టీ కమిటీలలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పని చేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలని సూచించారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలన్నారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచనలు చేశారు.
"ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

"స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంఛార్జ్ మంత్రులదే. నిధులు, బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు దృష్టిపెట్టడం లేదు. ఇది సరైనది కాదు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయండి" అని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications