సీన్.. ఢిల్లీకి ఛేంజ్- హాట్ హాట్ గా రేవంత్ బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్
Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్ది సేపటి కిందటే ఆరంభమైంది. పార్లమెంట్ సభ్యులు 15వ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటోన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో దిగారు. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని పోటీకి నిలిపింది ఇండియా బ్లాక్. ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏ తరపున మొదట ఆయనే ఓటు వేశారు. ఉదయం సరిగ్గా 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. ఆ వెంటనే ఓటు వేశారు. క్రమంగా పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ హౌస్ కు చేరుకుంటోన్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్ సందడిగా మారింది.

మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి, బిజూ జనతా దళ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీనివల్ల గెలుపు మార్జిన్ తగ్గే అవకాశం ఉంది. బీజేడీకి- 7, బీఆర్ఎస్- 4 ఎంపీలు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం పెరిగినందువల్ల ఈసారి ఎన్నికలు మరింత హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. రాజ్యసభలో ఆరు సీట్లు, లోక్‌సభలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి.. హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం అయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై వారికి దిశానిర్దేశం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన సమావేశం వివరాలను వారికి తెలియజేశారు. ఎక్కడా క్రాస్ ఓటింగ్ ఉండబోదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి.. పార్టీ అధిష్ఠానానికి భరోసా సైం ఇచ్చారు.
మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, జీ వంశీ, డాక్టర్ కడియం కావ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, కుందూరు రఘువీర్, రఘురాం రెడ్డి, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ తరఫున బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీంగా ఓటింగ్ జరగాలని చెప్పారు.












Click it and Unblock the Notifications