అందుకే సస్పెండ్ చేశాం: BRS సభ్యుల సస్పెన్షన్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదని అన్నారు. గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన అంశాలు చర్చకు రావొద్దని, ఫీజు రీయింబర్స్ మెంట్, కరువుపై, కొంతమంది చేసిన క్షుద్ర పూజలు చర్చలు వస్తాయన్న కారణంతోనే సభ మొదటి రోజే కుట్ర పూరితంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
"మా ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమే.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలనేదే మా ప్రభుత్వ సంకల్పం.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయం. సభలో ప్రతీ సభ్యుడి హక్కులను కాపాడేది సభాపతి" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వమే సభ నిర్వహణపై కొన్ని నిబంధనలు రూపొందించిందని అన్నారు. ఆ నిబంధనల మేరకే సభాపతి ఆదేశాలు ఇచ్చారని.. సభాపతి ఇచ్చిన ఆదేశాలను గేట్ 3 వద్ద పోలీసులు అమలు చేశారని తెలిపారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నల్ల టీషర్టు వేసుకుని వెళ్లారని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని.. నినాదాలతో కూడిన టీషర్టులతో లోపలకి రాకూడదని స్పీకర్ ఆదేశాలిస్తే వారు పాటించేవారు.. లోక సభ స్పీకర్ పార్లమెంటులో అలాంటి నిబంధనలు విధించలేదని గుర్తు చేశారు.

కానీ శాసనసభలో ఎలాంటి నిబంధనలు ఉండాలో గత ప్రభుత్వమే రూపొందించిందని.. పోలీసులపై దూషించి, అర్ధ నగ్న ప్రదర్శన చేసి, సభాపతిని కూడా దూషించారు. దీనిపై సభాపతికి క్షమాపణ చెప్పి సమస్యలపై చర్చ చేస్తారని భావించి మీరు వారిని సభలోకి అనుమతించారని తెలిపారు. కానీ విచక్షణ కోల్పోయి వ్యవహరించడం వల్లే వారిని మీరు సస్పెండ్ చేశారు.. వారు సభకు రాలేదని ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యతను విస్మరించలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తెలంగాణ శాసనసభ సమావేశాలు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. వెయ్యి రోజుల ప్రజాపాలనపై చర్చించాలని భావిస్తున్న ప్రభుత్వం శాసనసభ సమావేశాలను ఒకట్రెండు రోజులు పొడిగించేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
