వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం: ఓల్డ్ సిటీపై సీఎం వరాల జల్లు
హైదరాబాద్ నగరంలో రెండో భారీ స్టీల్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. చంచల్ గూడ-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాతబస్తీ అభివృద్ధి, విద్య, దేశభక్తి, మిర్ ఆలం ట్యాంక్ అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కానీ ప్రజా ప్రభుత్వం రూ. 620 కోట్లు నిధులు ఇచ్చి బ్రిడ్జిని పూర్తి చేసిందని అన్నారు.
"నేను గతంలోనే చెప్పాను.. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని.. ఇక్కడ ప్రతీ గల్లీ నాకు తెలుసు. అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఈ వేదికగా అధికారులను ఆదేశిస్తున్నా. ఎమ్మెల్యే బలాల కళాశాల అభివృద్ధి కోసం 20 కోట్లు అడిగారు.. 25 కోట్లు మంజూరు చేస్తున్నా. నేను నిధులు మంజూరు చేస్తా.. కానీ ఏడాదిన్నరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే.. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్ కు మద్దతుగా నిలిచి దేశభక్తి చాటుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. దేశ భక్తి విషయంలో అందరం ఒక్కటే. మీరు కేబుల్ బ్రిడ్జి చూడాలంటే దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే మేం మీరాలం చెరువులో 3 కి. మీ మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లోగా గౌలి గోడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం" అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
హైదరాబాద్ లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. హిందూ, ముస్లిం కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని వివరించారు. అలాగే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆరెస్ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూసీని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

"ఇక్కడి పేద ముస్లింలకు ఉపాధి కల్పించేలా చూస్తాం. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వండ్రాయణ గుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించబోతున్నాం. నగరాన్ని అన్ని రకాలుగా మేం అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. బీజేపీ, బీఆరెస్ అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత అందిస్తున్నాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసాక అభివృద్ధి ఒక్కటే లక్ష్యం. మనందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకొందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications