కాంగ్రెస్ బాకీ కార్డు వర్సెస్ బీఆర్ఎస్ ధోఖా కార్డు.. ఊపందుకున్న లోకల్ వార్!
తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలను తమవైపు మరల్చుకోవడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్నయుద్ధం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాకీలు ఉన్నదని కాంగ్రెస్ బాకీకార్డును ఆవిష్కరించి గ్రామ గ్రామాన ప్రజలకు పంపిణీ చేస్తోంది.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది. ఇక ఇదే సమయంలో బి ఆర్ ఎస్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ధోఖా కార్డును ఆవిష్కరించింది.

బీఆర్ఎస్ ధోఖాలపై నిలదీయాలన్న కాంగ్రెస్
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగున మోసం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం తప్ప బి ఆర్ ఎస్ ఏం చేసిందో చెప్పాలని నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ధోకా కార్డులను ఇంటింటికీ పంచి, బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే వాటిని చూపించి మీరేం చేస్తారో చెప్పాలని నిలదీయాలని కాంగ్రెస్ చెప్తోంది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం లక్షల కోట్ల అప్పులమయం
మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులమయంగా మార్చారని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధోకా కార్డును విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది. ప్రజలలోకి ఈ కార్డును తీసుకువెళతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఒకరు బాకీ కార్డు, ఒకరు ధోఖా కార్డు
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్ నేతల తీరు పైన మండిపడుతున్నారు. ఇక మొత్తానికి ఒకరు బాకీ కార్డుతో వెళితే మరొకరు ధోఖా కార్డుతో ప్రజలలోకి వెళుతున్నారు. ప్రజలు ఇద్దరిలో ఎవరి మాట నమ్ముతారు? ఎవరికి ఓటు వేసి పట్టం కడతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications