మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు: కర్ణాటకకు టీఎస్ఆర్టీసీ బృందం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్.
ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో టీఎస్ఆర్టీసీ(TSRTC) అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు.ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అమలవుతోన్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం రానున్న కొద్ది రోజుల్లో బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలిసింది. రెండు రోజులపాటు కర్ణాటకలోఈ పథకంను పరిశీలించి.. పూర్తి వివరాలతో ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు.

తెలంగాణలో వీలైనంత త్వరగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసే అవకాశం ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ పథకంను అమలులోకి తెచ్చింది.
రోజుకు ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారనే లెక్క తేలడం కోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానంలో మహిళలకు రూ. సున్నా అని ఉండే జీరో టికెట్ ఇస్తారు. దీంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి.. నెలవారీగా లెక్కిస్తారు. తెలంగాణలో కూడా అదే పద్ధతి ప్రవేశపెడతారా? మరో పద్ధతి అనుసరిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ఇది ఇలావుంటే, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించింది. అయితే, నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డీనరీ బస్సుల్లో మాత్రమే పథకంను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications