ఆ మంత్రి పోస్ట్ ఊస్టింగ్..?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆదివారం వరంగల్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంచార్జిలతో భేటీ అయిన ఆమె, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖతో వన్-టు-వన్ సమావేశం నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లాలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లోపించిందని అధిష్ఠానానికి ఫిర్యాదులు అందాయి. కొండా సురేఖ వ్యవహారశైలిపై పలువురు ఎమ్మెల్యేలు నేరుగా పీసీసీకి, అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై మీనాక్షి నటరాజన్, కొండా సురేఖతో చర్చించినట్లు సమాచారం.

మంత్రి కొండా సురేఖ కొంతకాలంగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన ఆరోపణలు పరువు నష్టం దావాకు దారి తీశాయి. గత ఏడాది దసరా ఫ్లెక్సీల వివాదంలో కొండా వర్గీయుల అరెస్టు, మంత్రి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం సంచలనం సృష్టించింది. వేములవాడ రాజన్న కోడెల వివాదం, మంత్రి అనుచరుడిపై కేసు నమోదు కావడం కూడా గత ఏడాది డిసెంబర్‌లో చర్చనీయాంశమైంది.
తాజాగా, పైసలిస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియరవుతాయి అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ కమీషన్ల సర్కార్ అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తాను గత బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ వివరించారు. ఇతర వివాదాస్పద వ్యాఖ్యలపైనా మీనాక్షి నటరాజన్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. తనపై వచ్చిన ఆరోపణలు, ఎమ్మెల్యేల అసంతృప్తిపై అవసరమైతే విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవాలని మీనాక్షికి కొండా సురేఖ సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications