డీకే రాజీ ఫార్ములా, మెట్టు దిగిన షర్మిల - ఇక అధికారికమే..!!
వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల(YS Sharmila) ఎట్టకేలకు మెట్టు దిగారు. రాజీ ఫార్ములా ప్రతిపాదించారు. కాంగ్రెస్(Congress) తో కలిసి సాగేందుకు నిర్ణయించారు. షర్మిలతో తాజాగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ (Sunil Kanugolu)చర్చలు చేసారు. షర్మిల డెడ్ లైన్ విధించటంతో కొత్త ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. షర్మిల నుంచి మరో అభ్యర్దన పార్టీ ముందుకు వచ్చింది. ఈ చర్చల తరువాత ఢిల్లీ (Delhi)నుంచి షర్మిలకు పిలుపు వచ్చింది. ఇక, కాంగ్రెస్ లో షర్మిల చేరిక లాంఛనంగా మారనుంది.
కాంగ్రెస్ లోకి షర్మిల : కొంత కాలంగా షర్మిల కాంగ్రెస్ లో చేరిక..పార్టీ విలీనం పైన వరుస చర్చలు సాగుతున్నాయి. షర్మిల ను కాంగ్రెస్ తో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించేలా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ - షర్మిల మధ్య వారధిగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు.

వైఎస్సార్ పైన ఇప్పటికీ సోనియా గౌరవంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాను తెలంగాణలో కాంగ్రెస్ కోసం పని చేస్తానని చెప్పారు. షర్మిలకు కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటుందని హామీ దక్కింది. షర్మిల తొలి నుంచి ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు.
ఖమ్మం సీటుపై గురి : ఇటు కాంగ్రెస్ నాయకత్వం షర్మిలతో చర్చలు చేస్తూనే..పాలేరు సీటును పొంగులేటి లేదా తుమ్మలకు కేటాయించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. దీంతో పాటుగా షర్మిల సేవలను ఏపీలోనే వాడుకోవాలని, తెలంగాణ కాంగ్రెస్ నుంచి వద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన వర్గం నేతలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
కానీ, తెలంగాణ స్థానికతే షర్మిల కోరుతుండడం మొత్తం ప్రక్రియలో చిక్కుముడిగా మారింది. ఈ సమయంలో షర్మిల ఈ నెల 30 తన అంశం పై తేల్చేందుకు డెడ్ లైన్ గా ఫిక్స్ చేసారు. ఈ సమయంలో కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ రంగంలోకి దిగారు. షర్మిలతో మంతనాలు చేసారు. షర్మిలకు రాజ్యసభ..పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిపైన ఢిల్లీ నుంచి హామీ వచ్చింది.

విలీనానికి నిర్ణయం : కానీ, షర్మిల పాలేరు పోటీ పైన చివరి వరకు పట్టుబటి...రాజీకి అంగీకరించారు. పాలేరు నుంచి కాదంటే తనకు ఖమ్మం లోక్ సభ సీటు కేటాయించాలని కోరారు. దీని పైన ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది.
షర్మిలకు సికింద్రాబాద్ సీటు ఇవ్వటానికి అభ్యంతరం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల మాత్రం ఖమ్మం కోరుకుంటుడటంతో డీకే శివకుమార్ సైతం ఈ సీట కోసం మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఖమ్మం సీటు పైన హామీ వచ్చినా రాకపోయినా..ఈ పరిస్థితుల్లో ఇక షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావటం లాంఛనంగా మారింది. ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications