కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అరెస్ట్: పొన్నాల కంటతడి
హైదరాబాద్: సచివాలయాన్ని తరలించాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు శనివారం ఉదయం చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్ లతోపాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.
తాము శాంతియుతంగా చేసుకుంటున్న పాదయాత్రను పోలీసులతో అడ్డుకోవాలనుకోవడం సరికాదని పొన్నాల, షబ్బీర్ అలీ, దానం అన్నారు. గతంలో టిఆర్ఎస్ నాయకులు కూడా ఆందోళన చేశారని గుర్తు చేశారు.

కాగా, పాదయాత్ర నాంపల్లి సమీపంలోకి చేరుకోగానే పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మల్లు రవి, రాజయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పొన్నాల లక్ష్మయ్య చెయ్యి బెనికింది. దీంతో ఆయన కంటతడిపెట్టారు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో నీమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
ఈ నేపథ్యంలో రోడ్డుపై బైఠాయించిన కొందరు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను, కార్యకర్తలను గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేతల పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పాదయాత్రలో సుమారు 300మందికి పైగా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications