మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్; తగ్గేదేలే!!
మునుగోడు ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఉప ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో టిఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్
ఇక తాజాగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. రెండు పేజీల కరపత్రాన్ని రూపొందించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో తమకు బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడు అంటూ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. అమ్ముడు పోయే రాజకీయ నేతలు ప్రజలకు ఎటువంటి మేలు చెయ్యలేరని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది.

బీజేపీతో 22వేల కోట్ల మైనింగ్ డీల్.. అందుకే కోమటిరెడ్డి పార్టీ మార్పు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీబీజేపీతో 22వేల కోట్లరూపాయల మైనింగ్ డీల్ కుదుర్చుకుని నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పార్టీ మారలేదని, తన స్వార్ధ ప్రయోజనాల కోసం, తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. గతంలో కోమటిరెడ్డిటిఆర్ఎస్ పార్టీ తో దోస్తీ చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్ధపరుడు అని ఆయనను టార్గెట్ చేసింది.

రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీలు అబద్దాలు.. ఆయన పచ్చి మోసకారి
ప్రజలకు సేవ చేస్తానని ఆయన ఇచ్చిన హామీలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత ప్రతి మండలంలో సొంతడబ్బుతో పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడింది.నియోజకవర్గంలోని పదివేల మంది యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి మోసంమోసం చేశారని, గతంలో ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసి మరీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆయన పచ్చి మోసకారి అని మండిపడుతుంది కాంగ్రెస్ పార్టీ.

కోమటిరెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని కాంగ్రెస్ ప్రచారం
తాను గెలిచిన వంద రోజుల్లో చర్లగూడెం రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇప్పిస్తానని,అలా చేయకపోతే ప్రాణత్యాగం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేశారని, ఇక ఆ ప్రకటన కూడా మోసమేనని ప్రజలకు చెపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా మీరు గెలిపిస్తే పార్టీని, ప్రజలను మోసం చేసి పార్టీ ఫిరాయించారని కాంగ్రెస్ నిప్పులు చెరుగుతుంది.

కోమటిరెడ్డికి చెక్ పెట్టే పనిలో కాంగ్రెస్
బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగి బలంగా ప్రచారం చేస్తూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఒకపక్క దేశంలోని అధికార బీజేపీని, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆయనను నిలువరించేందుకు ప్రయత్నం చేస్తుంది.












Click it and Unblock the Notifications