కాంగ్రెస్ నిరసనలో ఉద్రిక్తత-పోలీసులతో తోపులాట-కిందపడిపోయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు జీవన్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆయన కిందపడిపోయారు. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. కాసేపటికి పోలీసులు జీవన్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇందిరాభవన్ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన చేపట్టారు.అనంతరం పెట్రోల్ బంకు ఎదుట బైఠాయించి నిరసనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,కాంగ్రెస్ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు శుక్రవారం(జూన్ 11) రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.హైదరాబాద్‌లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేత్రుత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో పెట్రోల్‌పై అన్ని పన్నులు కలిపి రూ.9.34 ఉండేవని... ఇప్పుడది రూ.36గా ఉందని పేర్కొన్నారు. సామాన్యులకు పెట్రోల్ భారం గుదిబండగా మారిందన్నారు. పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ ఫ్లెక్సీలను కొంతమంది నేతలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో పెట్రోల్ ధర రూ.60 దాటలేదని కానీ మోదీ 7 ఏళ్ల పాలనలో రూ.100కి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications