Kaleshwaram ATM: కేసీఆర్ పేరుకు కొత్త అబ్రివేషన్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
KCRకు కొత్త భాష్యం చెప్పిన కాంగ్రెస్.. కాళేశ్వరం కరప్షన్ రావు అంటూ వినూత్న ప్రచారం..!!#KCR #CMKCR #KaleshwaraProject #Congress #TelanganaElection2023 #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/FItZ241dFR
— oneindiatelugu (@oneindiatelugu) October 31, 2023
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

అధికార భారత్ రాష్ట్ర సమితి ఒకే విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు విడతల వారీగా ఆయా జాబితాలను ప్రకటించాయి. మరో విడత బీజేపీ జాబితా ఇంకా రావాల్సి ఉంది. నవంబర్ 1వ తేదీ తరువాతే ఈ లిస్ట్ ఖరారవుతుందని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా తన ప్రచారాన్ని చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను టార్గెట్‌గా చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందనే నినాదాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. దీన్ని జనంలోకి తీసుకెళ్లడానికి కొత్త పంథాను ఎంచుకుంది.

కాళేశ్వరం ఏటీఎం (Kaleshwaram ATM) పేరుతో మాక్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. గులాబీ రంగుతో ఉన్న ఈ ఏటీఎంపై కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను ముద్రించింది. కాళేశ్వరం ఏటీఎం ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం 1,00,000,00,00,000 అనే అక్షరాలు దీనిపై కనిపించాయి.
ఈ మాక్ ఏటీఎంను పలు చోట్ల ఏర్పాటు చేశారు. బైబై కేసీఆర్ అంటూ నినదించారు. కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పారు. కేసీఆర్ అంటే- కాళేశ్వరం కరప్షన్ రావు (Kaleshwaram Corruption Rao) అంటూ విమర్శించారు. కేసీఆర్ ఫొటో ముద్రించి ఉన్న 2000 రూపాయల నోట్లను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీలో కుంగిపోవడమే దీనికి నిదర్శనమంటూ ఆరోపించారు. ఈ భారీ మొత్తం ఎలా దుర్వినియోగం చేసిందనే విషయంపై ప్రజలకు అవగాహనను కల్పిస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications