ఆడవాళ్ల వేషాల్లోనూ నయీం: పోలీసులకు వందల ఎకరాలు ఇలా పంపిణీ చేశాడు
హైదారాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని సిట్ ఛీప్ నాగిరెడ్డి అన్నారు. నయీం కేసుకు సంబంధించిన గుట్టు విప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ నాగిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాజేంద్రనగర్‌లోని ఏసీపీ ఆఫీసులో సిట్ బృందం సమావేశం ముగిసింది.
ఈ సమావేశానికి సిట్ ఛీప్ నాగిరెడ్డితో పాటు శంషాబాద్ డీసీపీ, భువనగిరి, రామన్నపేట, కోరుట్ల, నార్సింగి, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ పోలీసులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం నయీం కేసు విచారణ వివరాలను శనివారం ఆయన మీడియాకు వెల్లడించారు.
గురువారం తన సెల్ నెంబరును ప్రకటించిన నాగిరెడ్డికి నయీమ్ బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కంట్రోల్ రూంకు 60 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కోరుట్ల, కరీంనగర్‌లో నాలుగు దోపిడీ కేసుల్లో నయీం పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఇప్పటివరకు నాలుగు హత్య కేసుల్లో నయీంను నిందితుడిగా గుర్తించామన్నారు. హత్యకు గురైన వారిని నబీం అలియాస్ ఉదయ్ కుమార్, నస్రీం, అలీం భార్య టీనా, షియాన్‌లుగా గుర్తించామన్నారు. హత్యకు గురైన వారి కుటుంబం నుంచి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు.
మరో ముగ్గురిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు నయీంకు చెందినవిగా 20 ఇళ్లను గుర్తించామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇళ్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. దీంతో పాటు నయీం మారు వేషాల్లో అమ్మాయిల వేషధారణలో ఉన్న కొన్ని ఫోటోలను కూడా గుర్తించామని చెప్పారు.
విచారణలో భాగంగా రాజేంద్రనగర్, పుప్పాలగూడలోని నయీమ్ ఇంటిని మరోసారి తనిఖీ చేయడానికి పోలీసులు కోర్టు అనుమతి కోరారు. ఈమేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నయీమ్ అనుచరులు ఫర్హానా, అప్సాను విచారించిన అనంతరం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

నయీం డైరీలో రోజుకో నిమిషానికో నిజం వెలుగు చూస్తోంది. నయీం భూదందాల్లో పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హస్తం ఉన్నట్లు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. డీజీ స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను చక్కగా పంపకం చేశాడు.
నయీం డైరీలో తాజాగా వెలుగు చూసిన అంశాలు:
* యాదగిరి గుట్టలో డీజీ స్థాయి అధికారికి నయీం 80 ఎకరాలు
* ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఓ అధికారికి గిప్ట్‌గా రెండు ఖరీదైన కార్లు
* ఫిల్మ్ సిటిలో ఎస్ఐ నుంచి డీజీ స్థాయి వరకు 95 ఎకరాల వెంచర్లు
* నయీం సూచించిన డబ్బులున్న మావోయిస్టు డంపుని ఓ అధికారి మాయం
* అదనపు డీజీ స్థాయి అధికారితో లిక్కర్ దందా
* ఓ ఉన్నతాధికారి బావమరిదితో కలిసి నయీం చిట్ ఫండ్ కంపెనీ
* వికారాబాద్‌లో మరుపల్లిలో 200 ఎకరాల సెటిల్‌మెంట్
* శంకర పలిల్లో డాక్టర్‌ని బెదిరించి 18 ఎకరాల రిజిస్ట్రేషన్
* రంగారెడ్డి జిల్లాలో డీఐజీ స్థాయి అధికారికి 12 ఎకరాలు
* భువనగిరిలో సీనియర్ అధికారికి 8 ఎకరాలు
* భువనగిరిలో జరిగేలో ఉరుసు ఉత్సవాలుకు బందోబస్తు నిర్వహించిన పోలీసులకు బహుమతులు
* చేవెళ్లలో అదనపు ఎస్పీకి 100 ఎకరాలు
* మణికొండలో అధికారులు 40 పాట్లు
* శివరాంపల్లి పోలీసులతో కలిసి 400 ఎకరాల సెటిల్‌మెంట్
* టెలికం కాలనీలో సీఐ అధునాతన ఇల్లు కట్టించిన నయీం
* రాయదుర్గంలో 65 ఎకరాల భూమి సెటిల్‌మెంట్
* పోలీసు శాఖలో పలువురు అధికారులకు 16 ఏళ్లుగా రంజాన్ గిప్టులు
మరోవైపు, పోలీసులకు ఇంతవరకు పట్టుబడని నయీం అనుచరులు పలువురు కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోతారనే సమాచారంతో రాజేంద్రనగర్ కోర్టు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టుకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులని మోహరింపజేశారు.












Click it and Unblock the Notifications