‘కాంగ్రెస్ హామీలకు రూ. 1000 పెంచితే.. బీఆర్ఎస్ మేనిఫెస్టో’
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము ఇచ్చిన హామీలను సాధ్యం కాదన్న బీఆర్ఎస్.. ఇప్పుడు తమ హామీలనే కాపీ కొట్టి మేనిఫెస్టోగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే.. తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారన్నారు రేవంత్. 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 51 మందికే బీఫారాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూడగానే సీఎం కేసీఆర్ కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొట్టేందుకే ఆయనకు సమయం సరిపోతోందన్నారు.

కేసీఆర్ నిరంతరం మద్యం, మైనింగ్, ల్యాండ్ మాఫియా ద్వారా ఎలా సంపాదించాలనే ఆలోచనలు చేస్తుంటారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలనే కేసీఆర్ ఒక్కో వెయ్యి పెంచుతూ కాపీ కొట్టారని తెలిపారు. స్వంతంగా ఆలోచన చేసే శక్తిని కేసీఆర్ కోల్పోయారని రేవంత్ విమర్శించారు.
ఒకప్పుడు కేసీఆర్ అడుగుల్లో ఇతర పార్టీలు నడుస్తాయని అనేవారని.. ఆలోచనలు క్షీణించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను అనుసరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హతను బీఆర్ఎస్ నేతలు కోల్పోయారన్నారు. ఎన్నికల్లో ఓటర్లకు చుక్క మందు పోయకుండా, డబ్బు పంచకుండా ఎన్నికల్లో కొట్లాడుదామని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. దీనిపై 17వ తేదీ మధ్యాహ్నం అమరవీరుల స్థూపం వద్ద.. మే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయబోమని ప్రమాణం చేస్తా.. కేసీఆర్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ విసిరారు.
అవినీతికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారన్న రేవంత్.. కేసీఆర్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని అన్నారు. కేసీఆర్ బుర్ర కరప్ట్ అయ్యిందన్నారు. వందకు వందశాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications