వెయ్యి కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ చేసిందేంటి?: బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్
హైదరాబాద్: కరోనావైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఆరోపించారు. కరోనాతో జనాలు పిట్టల్లా రాలుతున్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని.. రాష్ట్రంలో పాలన పడకెక్కిందని అన్నారు. వందమంది టెస్టులకు వెళితే.. 40 మందికి పాజిటివ్ వస్తుందని అన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన సీఎం కరోనా కట్టడికి చేసిందేమీ లేదన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ నిస్సహాయులు.. ఆయన ఆస్పత్రులకు తిరుగుతూ సీఎంతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అంటున్నాడని అన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న ఆయన.. ఎన్నికల కన్నా కరోనా నియంత్రణ చర్యలకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. వివిధ పార్టీలు ఇప్పటికే నగరపాలక ఎన్నికలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయన్నారు. బాధ్యతాయుతంగా ఆలోచించి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు.
రాష్ట్రంలో తాజా పరిస్థితులను వివరిస్తూ, మున్సిపల్ ఎన్నికల వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు వినతి పత్రం మెయిల్ చేయడం జరిగిందని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వెంటనే స్పందించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
కాగా, తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,542 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 20 మంది మరణించారు. 2,887 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,67901కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,19,537 మంది ఉన్నారు. 1,876 మంది మృత్యువాత పడ్డారు. తాజా బులెటిన్ ప్రకారం.. 46,488 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి.












Click it and Unblock the Notifications