హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ రౌండప్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా సంగతులు.. ప్రభుత్వ చర్యలపై సమగ్ర కథనం..

|
Google Oneindia TeluguNews

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు నెల క్రితం అక్కడక్కడా కేవలం సింగిల్ డిజిట్‌లో నమోదైన కేసులు ఇప్పుడు డబుల్ డిజిట్‌లోకి వచ్చేశాయి. మొత్తం కేసుల సంఖ్య 15వేలకు చేరువలో ఉంది. అయితే లాక్ డౌన్,సోషల్ డిస్టెన్స్ వంటి నియంత్రణ చర్యలు భారత్ మెరుగ్గా అమలుచేస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఇస్తున్న కితాబులు, పలు రాష్ట్రాల్లో డబ్లింగ్ రేటు తగ్గిందంటూ కేంద్ర ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రకటనలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కరోనా లాక్ డౌన్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర కథనం మీకోసం...

ఏపీలో ఎన్ని హాట్ స్పాట్స్..

ఏపీలో ఎన్ని హాట్ స్పాట్స్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కేంద్రం హాట్ స్పాట్లుగా ప్రకటించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలన్నీ హాట్ స్పాట్స్‌గా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 165 చోట్ల కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తి ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లను కంటోన్మెంట్ జోన్‌గా పేర్కొంటున్నామని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలోని నివాసితులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అక్కడి ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వమే అందజేస్తోంది.గుంటూరులోని కొన్ని కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రజా అవసరాల రీత్యా జీడీసీసీ బ్యాంక్‌ సహకారంతో మొబైల్‌ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

ఏపీలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ శాఖ ఆధ్వర్యంలో 221 కంటైన్‌మెంట్ క్లస్టర్ల పరిధిలో 3,01,002 గృహాల్లో సర్వే నిర్వహించారు. ఆ గృహాల్లోని ప్రతీ ఒక్కరితో ప్రత్యేక వైద్య బృందాలు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటున్న వారిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కరోనా బారినపడిన వారిలో 90శాతం మంది స్మార్ట్‌ఫోన్లను వాడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యే పేషెంట్లకు రూ.2వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అటు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు కూడా యాక్టివ్‌గా పనిచేస్తూ ఇళ్లకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.

కోవిడ్ 19 ఆసుపత్రులు.. డాక్టర్ల కేటాయింపు..

కోవిడ్ 19 ఆసుపత్రులు.. డాక్టర్ల కేటాయింపు..

ఏపీలో 4 జిల్లాల్లో రాష్ట్ర‌ స్థాయి కరోనా ఆసుపత్రులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 600 పడకలు, విశాఖ‌లో 520 పడకలు, చిత్తూరులో504 పడకలు, నెల్లూరులో 500 పడకలతో ప్రభుత్వం ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు ప్రతీ జిల్లాలోనూ జిల్లా స్థాయి కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పేషెంట్లకు మొత్తం 8950 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవలే దాదాపు లక్ష టెస్టింగ్ కిట్లను సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. వైద్యులకు ఏవిధమైన కొరత లేదని,కొత్తగా మరికొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఏయే జిల్లాకు ఎంతమంది వైద్యులను కేటాయించారో జాబితా కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ పరిశ్రమలు,ఇసుక తవ్వకాలు,క్వారీ కార్యకలాపాలు,వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో హాట్ స్పాట్స్.. కంటైన్‌మెంట్ జోన్లు..

తెలంగాణలో హాట్ స్పాట్స్.. కంటైన్‌మెంట్ జోన్లు..

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, గద్వాల, మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. నల్గొండ జిల్లాను రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్)గా గుర్తించింది. సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు ఆరెంజ్ జోన్లు(నాన్-హాట్ స్పాట్)గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 766 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 417,నిజామాబాద్‌లో 58 కేసులు నమోదయ్యాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు

తెలంగాణలో మొత్తం 8 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన కరోనా ఆసుపత్రిగా సేవలందిస్తోంది. గచ్చిబౌలి ఆసుపత్రి, కింగ్ కోఠిలోని జిల్లా ఆసుపత్రి, బేగంపేట్‌లో ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి, చార్మినార్ ప్రాంతంలోని గవర్నమెంట్ నిజామీయా జనర్ ఆసుపత్రి, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి, వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద టీచింగ్ ఆసుపత్రి, హైదరాబాద్‌లోని రామాంతపూర్ ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలల్లోనూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్క గచ్చిబౌలిలోనే దాదాపు 1500 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్ష జరుపుతూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. వలస కార్మికులకు సైతం ఒక్కొక్కరికి రూ.1500తో పాటు రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.పలు చోట్ల షెల్టర్స్ ఏర్పాటు చేసి నిరాశ్రయులకు,యాచకులకు ఆహారం అందిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సహకం కింద ఇటీవలే వైద్యులకు గ్రాస్ శాలరీలో 10శాతం,పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7500,గ్రామీణ ప్రాంతాల్లో రూ.5000 ప్రకటించారు. మంత్రి కేటీఆర్ సహా అధికారులు ప్రజల నుంచి ఏ విజ్ఞప్తి వచ్చినా వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.

సడలింపులపై రేపు నిర్ణయం..

సడలింపులపై రేపు నిర్ణయం..

కేంద్రం ప్రకటన కంటే ముందే తెలంగాణలో కరోనా లాక్ డౌన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30వరకు పొడగించారు. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి కేంద్రం ఇచ్చే సడలింపుల పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆదివారం(ఏప్రిల్ 19)న నిర్ణయం తీసుకోనున్నారు.సంపూర్ణ లాక్ డౌన్‌ను కొనసాగించడమా లేక కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సడలింపులు ఇవ్వడమా అన్న విషయంపై రేపు నిర్ణయిస్తారు. ఇక రాష్ట్ర‌వ్యాప్తంగా 12,751 గ్రామాలకు కరోనా నియంత్రణ చర్యల కోసం రూ.308 కోట్లు విడుదల చేశారు. జనాభాతో సంబంధం లేకుండా అవ‌స‌రాన్ని బ‌ట్టీ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షలు నుంచి రూ.7 లక్షల వరకు మంజూరు చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణ చర్యలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది.

ఇక ఏఏ రాష్ట్రంలో ఎన్ని కేసులున్నాయి, ఎన్ని మరణాలు నమోదయ్యాయి అనే సమగ్ర వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Recommended Video

New Infection In 3 To 11 Years Of Age Kids In AP

English summary
coronavirus cases and taking measures complete roundup on telugu states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X