కరోనా డేంజర్ బెల్స్ : తెలంగాణలో వేగంగా విస్తరిస్తోన్న రెండో దశ.. ఆ డాక్టర్ దంపతులకు ఎలా సోకింది?
కరోనా వైరస్.. మొదటి దశలో విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రమే బయటపడుతుంది. రెండో దశలో.. స్థానికులకూ వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రెండో దశ కొనసాగుతోంది. అయితే తెలంగాణలో ఇది మరింత వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 10 మంది తెలంగాణ స్థానికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉండటం మరింత కలవరపెడుతోంది. ఈ ఇద్దరికీ విదేశీ ట్రావెల్ హిస్టరీ కూడా లేకపోవడంతో.. ఎవరి నుంచి వీరికి వైరస్ సోకిందన్నది మిస్టరీగా మారింది.

తిరుపతి వెళ్లి వచ్చిన ఆ డాక్టర్..
వైరస్ సోకిన ఆ డాక్టర్ దంపతులు హైదరాబాద్‌లోని దోమలగూడకు చెందినవారు. భర్త నెల 14 నుంచి 16 వరకు ఇంట్లోనే సెలవులో ఉన్నాడు. 17వ తేదీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో తిరుపతికి వెళ్లాడు. అక్కడ స్విమ్స్ ఆసుపత్రిలో ఓ డాక్టర్‌ని కలిసి అదే రోజు తిరిగొచ్చాడు. ఆ తర్వాత రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 20వ తేదీ తాను పనిచేసే ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా జ్వరం వచ్చినట్టు అనిపించడంతో మధ్యలోనే ఇంటికొచ్చేశాడు. ఆరోజు నుంచి 24వ తేదీ వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని మందులు వాడాడు.

ఇలా బయటపడింది
మూడు రోజుల విశ్రాంతి,మెడిసిన్ తర్వాత కూడా జ్వరం తగ్గకపోవడంతో భార్యతో కలిసి గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా.. ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతని తల్లికి నెగటివ్ అని తేలగా.. తండ్రి, ఇద్దరు పిల్లల మెడికల్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వైరస్ సోకిన డాక్టర్ ట్రావెల్ హిస్టరీ గురించి ఆరా తీయగా.. విదేశాలకు వెళ్లలేదని తేలింది. దీంతో ఎవరి నుంచి వారికి వైరస్ సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్ దంపతులతో కలిసినవారు అప్రమత్తంగా ఉండాలని.. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్యశాఖను సంప్రదించాలని సూచించారు.

వేగంగా రెండో దశ
రాష్ట్రంలో రెండో దశ వేగంగా విస్తరిస్తోంది. గురువారం(మార్చి 26)న పాజిటివ్‌గా తేలిన నలుగురు వ్యక్తులు స్థానికులే కావడం గమనార్హం. వీరికి ఎలాంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదు. ఇటీవలే విదేశాల నుంచి కొత్తగూడెం వచ్చిన డీఎస్పీ కొడుకు ద్వారా.. డీఎస్పీకి,ఆ ఇంట్లో పనిచేసే వంట మహిళకు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే స్వీడన్ నుంచి హైదరాబాద్‌లోని మణికొండకు వచ్చిన ఓ వ్యక్తి(34) ద్వారా అతని తల్లి(64)కి వైరస్ సంక్రమించింది. లండన్ నుంచి కోకాపేటకు వచ్చిన వ్యక్తి ద్వారా అతని భార్యకు వైరస్ సోకింది. ఇక కరీంనగర్ వచ్చిన ఇండోనేషియా వాసుల ద్వారా ఓ స్థానిక యువకుడికి వైరస్ సోకింది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో రెండో దశ వేగంగా విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో లోకల్ కాంటాక్ట్ అయిన రోగుల ద్వారా జనసామాన్యంలోకి వైరస్ వ్యాప్తి చెందిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరికొద్దిరోజులు గడిస్తే గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. లోకల్ కాంటాక్ట్ కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే.. తెలంగాణ మొత్తం రెడ్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు.












Click it and Unblock the Notifications