చోరీ సొమ్ముతో ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు: పట్టుబడ్డారు
హైదరాబాద్: పెళ్లి చేసుకోవడానికి ఓ జంట దొంగతనం చేసి, చివరకు కటకటాల పాలైంది. పెళ్లి చేసుకోవటానికి డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించారు. అతన్ని కొట్టి రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డు లాక్కొని పారిపోయారు. చివరకు ఆ ప్రేమికులు కటకటాల పాలయ్యారు.
రవికుమార్, దేవరకొండ హిమబిందు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకోవాలని అనుకున్నారు. డబ్బు అవసరమైంది. దీంతో నిరుడు ఆగస్టులో హైదరాబాదులోని మలక్‌పేటలో నివసిస్తున్న నాగరాజును బెదిరించి కొట్టారు.

అతడి వద్ద నుంచి ఫోన్లు, ఏటీఎం కార్డు లాక్కొని పారిపోయారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు అవసరం కావడంతో చోరీ చేసిన ఒక సెల్‌ఫోన్‌ను అమ్మేశారు. ఏటీఎం నుంచి రూ. 40 వేలు డ్రా చేసి వివాహం చేసుకున్నారు.
కొద్దిరోజుల పాటు స్విచ్చాఫ్ చేసిన మరో సెల్‌ఫోన్‌ను వాడటం ప్రారంభించారు. అది పాడు కావడంతో సిమ్‌ను మరో మొబైల్‌లో వేసి వాడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. సెల్‌ఫోన్ డాటా సేకరించి లొకేషన్ ఆధారంగా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్టు తెలుసుకున్నారు. సోమవారం అరెస్టు చేసి నగరానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications