తెలంగాణలో తగ్గిన వైరస్ వ్యాప్తి -కొత్తగా 293 కేసులు, ఇద్దరి మృతి -ఆ రెండు జిల్లాల్లో నేడు వ్యాక్సిన్ డ్రైరన్
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహక ఏర్పాట్లు కొనసాగుతోన్న వేళ తెలంగాణలో వైరస్ వ్యాప్తి మళ్లీ తగ్గినట్లు లెక్కల్లో వెల్లడైంది. తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 293 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. అదే శుక్రవారం నాటి బులిటెన్ లో 461 కొత్త కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో నిన్న(శుక్రవారం) రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 293 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,108కి చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,546కి చేరింది.

కరోనాబారి నుంచి శుక్రవారం 535 మంది కోలుకోగా, ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,79,991కి చేరింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.1శాతం కాగా, తెలంగాణలో అది 97.52 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 5,571 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 3,418 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా నమోదైన 293 కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే వెలుగులోకి రావడం గమనార్హం. హెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 72 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 26, కరీంనగర్ జిల్లాలో 22, వరంగల్ అర్బన్ 14, సంగారెడ్డి జిల్లాలో 12 కొత్త కేసులు వచ్చాయి. మిగతా అన్ని జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ లోనే ఉంది. ఇదిలా ఉంటే..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టారు. అందులో భాగంగా తెలంగాణలోని రెండు జిల్లాల్లో డమ్మీ వ్యాక్సిన్లను ప్రజలకు అదించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా రాబోయే రోజుల్లో అసలైన వ్యాక్సిన్ పంపిణీ సమయంలో తలెత్తే ఇబ్బందులను అంచనావేసి, అప్రమత్తం అయ్యే వీలుంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications