తెలంగాణలో కరోనా: టెస్టుల తగ్గింపు -కొత్తగా 592 కేసులు, 3మరణాలు -గ్రేటర్‌లోనే ఎక్కువ
తెలంగాణలో కరోనా టెస్టుల డేటాపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతోండటం, ప్రతిరోజూ కనీసం 50 వేలకు తగ్గకుండా టెస్టులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం తదితర పరిణామాల తర్వాత కూడా సాధారణం కంటే తక్కువ టెస్టులు చేస్తుండటం గమనార్హం. వాటి ప్రకారమైతే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దాదాపుగా తగ్గినట్లే భావించాల్సి ఉంటుంది..
తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,970 శాంపిల్స్ ను మాత్రమే పరీక్షించారు. మొత్త టెస్టుల సంఖ్య 64,43,052గా ఉన్నట్లు చెప్పారు. కొత్తగా 592 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,81,414కు చేరాయి.
గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి మరో ముగ్గరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 1513కు పెరిగింది. కరోనా మరణాల రేటు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం అది 0.53 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. మరోవైపు..

రాష్ట్రంలో డిశ్చార్జీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 643 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,013 మంది డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 95.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో మాత్రం 97.01 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో..
కొత్త కేసుల తగ్గుదల, డిశ్చార్జిల పెరుగుదలతో ప్రస్తుతానికి తెలంగాణలో యాక్టివ్ కేసులు 6,888గా ఉన్నాయి. ఇందులో 4719 మంది హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారని ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 119, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 70, రంగారెడ్డిలో 57 నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications