అయ్యప్ప స్వాములకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు
Covid 19 variant JN.1: రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. క్రమంగా విజృంభిస్తోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్టవేసింది. 79 సంవత్సరాల వృద్ధురాలు ఒకరు ఈ కొత్త వేరియంట్ బారిన పడి మరణించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆరుమంది మరణించారు. కేరళలో అయిదు కోవిడ్ మరణాలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఈ కొత్త కోవిడ్ బారిన పడి మృతిచెందారు.

కేరళలో కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వయోధిక వృద్ధులు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుందని తెలిపింది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాస్కులను ధరించాలని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. చలి తీవ్రత పెరగడం, పండగ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది.
కోవిడ్ స్థితిగతులపై వైద్య- ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డుల గురించి ఆరా తీశారు. కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నస్టిక్ టెస్టులు, మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్.. వంటి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని దామోదర్ రాజనర్సింహ అధికార యంత్రాంగానికి సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలని అన్నారు.
కేరళలో కోవిడ్ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో- శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక చర్యలను తీసుకోవాలని దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులను ధరించాలని, అనారోగ్యం, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు.












Click it and Unblock the Notifications