క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు, ఏపీలో పిడుగుపడి ఇద్దరు మృతి
తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఆడుతూ వేర్వేరు కారణాలతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే ప్రణీత్(32) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడ్ని పాత బోయినపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుండగా.. అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడు ఓ బ్యాంకు ఉద్యోగి.

క్రికెట్ ఆడుతుండగా.. పిడుగుపడి ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరుబయట క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో పశువుల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బెస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతులు గోషిపోతల ఆకాష్ (17), పులిగుజ్జు తన్ని(18)గా స్థానికులు గుర్తించారు.
ఆదివారం సెలవు దినం కావడంతో క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గాయపడిన పశువుల కాపరిని కంభంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications