హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్! ఆ లోన్స్ ఇక ఇవ్వరు
హైదరాబాద్ నగర వాసులకు ఇది చేదువార్తే. బ్యాంక్ రుణాల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తాజా మార్గదర్శకాలతో నగర వాసులకు షాక్ తగలనుంది. వ్యవసాయం కోసం అంటూ బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను కేవలం పంట సాగు చేసే భూమి ఉన్న ప్రాంతంలోని బ్యాంకులే ఇవ్వాలని ఇటీవల ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ భూమి ఒకచోట ఉండి, రైతు మరో ప్రదేశంలో నివసిస్తున్న సందర్భంలో ఆ నివాస ప్రాంతంలోని బ్యాంకు బంగారం తాకట్టు పెట్టుకొని రుణం ఇస్తే ఆ మొత్తాన్ని ఆ భూమిలో, ఆ పంట సాగుకే వినియోగించినట్లు రైతు రుజువులు చూపించాల్సి ఉంటుంది.
అంతేగాక, క్షేత్రస్థాయికి వెళ్లి బ్యాంకు అధికారులూ పరిశీలించాలి. వివరాలను ఆ భూమి ఉన్న సమీప బ్రాంచికి పంపించి అక్కడి సిబ్బందితో తనిఖీ చేయించాలని ఆదేశించింది. బ్యాంకులకు తనిఖీ వ్యవస్థ అంత పటిష్ఠంగా లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని వారికి ఈ రుణాలను నిలిపేశారు. బ్యాంకు అధికార వర్గాలు ఈ విషయం తాజాగా వెల్లడించాయి.

పంట సాగు పేరుతో వడ్డీ రాయితీని పొందడానికి నగరాల్లో ఎక్కువ మంది ఈ రుణాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులో బంగారం తాగట్టు పెట్టుకుని రూ.100 రుణంపై సంవత్సరానికి 9 శాతం వడ్డీని వసూలు చేస్తుండగా.. వ్యవసాయం పేరుతో తీసుకుంటే అందులో 0.25 శాతం రాయితీ లభిస్తుంది. అంతేగాక, వ్యవసాయం పేరుతో తీసుకుంటే బంగారం విలువలో 85 శాతం సొమ్మును రుణంగా ఇస్తున్నారు. వ్యవసాయేతర అవసరం కోసం అని బంగారం తాకట్టు పెడితే కొన్ని బ్యాంకులు 65 శాతం సొమ్మే ఇస్తున్నాయి.
దీంతో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు నగర వాసులు వ్యవసాయం పేరు చెప్పి రుణాలు తీసుకుంటున్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాస్తవాలను పరిశీలించకుండా బ్యాంకులు వ్యవసాయం కోసమని బంగారం తాకట్టు రుణాలు ఇస్తుండటంతో ఆ సొమ్ము ఇతర అవసరాలకు వాడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ నుంచి అందిన తాజా ఆదేశాలతో ఇక్కడ బ్యాంకులు ఈ రుణాలను నిలిపివేశాయి.
భూముల యజమానులు బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం పేరుతో రుణం తీసుకుంటే దాన్ని 'పంటరుణం' అనే పద్దు కిందనే బ్యాంకులు చూపుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ అమలు సమయంలో ఈ విషయాన్ని పరిశీలించి బంగారం తాకట్టు రుణాలను ప్రత్యేకంగా చూపాలని సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications