రాజధాని నడిబొడ్డున.. కోట్లలో పాత నోట్లను మార్చే ముఠా అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాత నోట్లకు కొత్త నోట్లు అందించే ముఠాల వ్యాపారం ఇంకా సాగుతూనే ఉంది. రోజూ ఎక్కడో ఒకచోట ఈ దందా చేస్తున్న ముఠాలు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిస్తున్న ఒక పెద్ద ముఠా పట్టుబడింది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నడిబొడ్డున బషీర్ బాగ్ లోని మొఘల్ కోర్టు బిల్డింగులోని జైన్ అసోసియేట్స్, మాస్ ఐటీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఏకంగా రూ.8 కోట్ల మేర పాత నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ముఠా పట్టుబడింది.

old notes exchange

రద్దయిన రూ.500, 1000 నోట్లు ఇస్తే పర్సంటేజీ లెక్కన కొత్త నోట్లు మార్పిడి జరుగుతున్న సమయంలో ముఠా సభ్యులు పోలీసులకు దొరికిపోయారు. కోటి రూపాయల పాతనోట్లు ఇస్తే.. 43 లక్షల కొత్తనోట్లు చెల్లిస్తున్నారు.

43:57 నిష్పత్తిలో రూ.57 లక్షలు కమీషన్ గా తీసుకుని మిగిలిన డబ్బును కొత్త నోట్ల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉప్పందడంతో టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మొఘల్ కోర్టు బిల్డింగ్ ను చుట్టుముట్టారు.

ఈ దాడిలో నోట్ల మార్పిడి ముఠాకు చెందిన దాదాపు 10 మంది సభ్యులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా కొంతకాలంగా ఇలా పాతనోట్లు మారుస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా ఉదంతంలో.. డబ్బు తీసుకొచ్చిన ఓ వ్యక్తి తన పేరు సైదులు అని, తాను మియాపూర్ నుంచి వచ్చానని తెలిపారు. నలుగురైదుగురికి సంబంధించి కోటి రూపాయల పాత నోట్లు తీసుకొచ్చానని, 57 శాతం కమీషన్ తీసుకుని మిగతా 43 శాతం కొత్త నోట్లు ఇస్తామని చెప్పడం వల్లనే తాను పాతనోట్లు తీసుకొచ్చానని, పూర్తి వివరాలు తనకు తెలియవని, మధ్యవర్తుల ద్వారా ఈ సమాచారమే తనకు తెలిసిందని అతడు వివరించాడు.

నగరం నడిబొడ్డున భారీ స్థాయిలో నోట్ల మార్పిడి వ్యవహారం వెలుగుచూడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న పోలీసులు మాత్రం ఇంకా వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.

సదరు కార్యాలయం నుంచి దాదాపు రూ.8 కోట్ల పాతనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోటి రూపాయల పాత నోట్లతో వచ్చిన సైదులు చెప్పిన దాని ప్రకారం.. పాత నోట్లు మార్చుకోవడానికి ఇక్కడికి చాలామంది వచ్చినట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బును పెద్ద పెద్ద గోనె సంచులు, మరో బ్యాగును తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. దీనిపై వారి విచారణ ఇంకా కొనసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad: A gang, involved in exchanging demonetised currency with new ones, was caught by the Taskforce, Saifabad police here on Monday night. Old currency notes with a face value of Rs.8 crore was seized from them.
Please Wait while comments are loading...