తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం: రాజకీయ వ్యూహకర్త ఆఫీస్‌పై పోలీసుల మెరుపు దాడి
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కూడా సమాయత్తమౌతోన్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి- ఏకంగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్- బుధవారం మధ్యాహ్నం ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఓటములతో డీలా..
అదే సమయంలో- కాంగ్రెస్ కూడా ఎన్నికల కోసం సన్నద్ధమౌతోంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ ఆశించిన స్థాయిలో పోరాట పటిమను ప్రదర్శించలేకపోయింది కాంగ్రెస్. 2014, 2018లో అదే పరిస్థితి నెలకొంది. దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మునుగోడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల బరిలోనూ పోరాట పటిమను కనపర్చలేకపోయింది కాంగ్రెస్. ఈ దఫా అలాంటి పరిస్థితి గానీ, ఫలితాలు గానీ రాకూడదనే పట్టుదలతో ఉంది.

ఎన్నికల కోసం కసరత్తు..
2023 చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తను నియమించుకుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో దీనికోసం స్ట్రాటజీ టీమ్‌ను రూపొందించుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలు ఈ టీమ్‌కు హెడ్‌గా వ్యవహరిస్తోన్నారు. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేయడంతో పాటు కాంగ్రెస్ విజయానికి పక్కా ప్రణాళికలను రూపొందించడంలో తలమునకలై ఉందా స్ట్రాటజీ టీమ్.

కంప్యూటర్ సీజ్..
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీకి సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పోలీసులు షాక్ ఇచ్చారు. సునీల్ కానుగోలు కార్యాలయంపై మెరుపుదాడికి దిగారు. ఆయన కార్యాలయం నుంచి కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో ఈ దాడులు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. కొన్ని కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు కూడా..
సునీల్ కానుగోలు కాంగ్రెస్ జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడు కూడా. ఇదివరకు ఆయన టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తరువాత ఆ పార్టీకి దూరం అయ్యారు. కేసీఆర్- పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో కాంటాక్ట్ అయిన నేపథ్యంలో సునీల్ కానుగోలు బయటికి రావాల్సి వచ్చింది. అనంతరం ఆయన కొద్దిరోజులు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications