రైతులకు అలర్ట్: ఆ లింక్‌లు ఓపెన్ చేస్తే.. రుణమాఫీ డబ్బులు మాయం!
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా, గురువారం తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ. 7 వేల కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు.
ఏదో ఒక బ్యాంక్ పిక్చర్‌ను వాట్సాప్ ప్రొఫైల్ డీపీగా పెట్టి ఏపీకే ఫైల్స్(APK files), లింక్స్ పంపుతున్నారు. మీ బ్యాంక్‌లో రుణమాఫీ డబ్బులను ఈ కింది లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అంటూ లింక్స్ పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తంగా ఉండాలని రైతులు, ప్రజలకు సూచిస్తోంది.

సైబర్ నేరగాళ్లు పంపించే లింక్‌పై క్లిక్ చేస్తే(యాక్సెప్ట్ చేస్తే).. ఫోన్ వాళ్ల కంట్రోల్లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దని చెప్పింది. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించింది. ఇక, ఫోన్ పే, గూగుల్ పే వాడకంలో జాగ్రత్తలు పాటించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది.
కొంతమంది సైబర్ నేరగాళ్లు గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా కొంత డబ్బు పంపించి.. మిగితా డబ్బుల కోసం లింక్ ఓపెన్ చేసి చూసుకోవాలని మేసేజ్‌లు పంపిస్తున్నారని.. అలాంటి వాటికి కూడా స్పందించొద్దని సైబర్ సెక్యూరిటీ సూచించింది. రైతు రుణమాఫీ పేరుతో వచ్చే లింక్స్ ను తొందరపడి ఓపెన్ చేయవద్దని కోరింది. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో బ్యాంక్ వాళ్లకు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవాలని లేదా బ్యాంక్ దగ్గరకు వెళ్లి విచారణ చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications