సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ : ఆర్టీసీ ఎండీగా నియామకం : నెక్ట్స్ కీలక హోదాలో..!!
పోలీసు అధికారుల్లో ప్రజల అభిమానాలు అందుకున్న అధికారిగా పేరున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయన్ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్ కు చెందిన సజ్జనార్ 2018 మర్చి 13న సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. మూడున్నారేళ్లు ఆయన ఆ హోదాలో ఉన్నారు. ఆయన స్థానంలో స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ పోలీసు కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వరంగల్ నుంచే కెరీర్ ఆరంభం..
సజ్జనార్ పోలీసు అధికారిగా తన కెరీర్ ను వరంగల్ జిల్లాలో జనగాం ఏఎస్పీగా ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో పలు జిల్లాల్లో ఆయన పని చేసారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ ఎస్పీగా పని చేస్తుండగా అప్పుడు జరిగిన ఒక ఘటనలో సజ్జనార్ పేరు ప్రముఖంగా తెలిసింది. ఇద్దరు విద్యార్ధినిల పైన యాసిడ్ దాడి జరిగింది. అందులో ఒక విద్యార్ధి మరణించగా..మరో విద్యార్ధిని క్రమేణా కోలుకున్నారు. ఆ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసే సమయంలో వారు పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేయగా ... జరిగిన ఎన్ కౌంటర్ ఆ ముగ్గురు నిందితులు మరణించారు.

సైబరాబాద్ లో సజ్జనార్ మార్క్..
ఈ ఘటన 2008లో చోటు చేసుకుంది. ఆ తరువాత ఆయన సుదీర్ఘ కాలం సీఐడీ...ఇంటలిజెన్స్ విభాగాల్లో పని చేసారు. సైబర్ నేరాల పైన అవగాహన ఉన్న అధికారిగా పేరొందారు. ఇక, సైబరాబాద్ కమిషనర గా సజ్జనార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలిచే సైబరాబాద్ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు.. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. అక్కడ రక్షణ బాధ్యతలు ప్రభుత్వం సజ్జనార్ కు అప్పగించింది. తొలి నుంచి ప్రత్యేక ప్రణాళికలతో సజ్జనార్ తన మార్క్ చూపించారు.

దిశ ఘటన- నిందితుల ఎన్ కౌంటర్..
ఇక, 2019 లో శంషాబాద్ వద్ద దిశ ఘటనతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది. ఆ దారుణ సంఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని సీన రీ కన్ స్ట్రక్షన్ కోసం 2019, డిసెంబర్ 6న ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అందులో ఇద్దరు నిందితులు తుపాకులు లాక్కొని పోలీసుల పైన దాడికి పాల్పడ్డారు. దీంతో..ఆ సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ తో ముగ్గరు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడైతే దిశ ప్రాణాలు కోల్పోయిందో..అదే ప్రాంతంలో ఆ ముగ్గరు నిందుతులు ప్రాణాలు వదిలారు.

దేశ వ్యాప్తంగా సజ్జనార్ కు అభినందనలు..
దీంతో..ఆ ముగ్గురికి సరైన శిక్ష పదిందంటూ దేశ వ్యాప్తంగా సజ్జనార్ కు ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తాయి. ఆ ప్రాంత వాసులు పూలతో సజ్జనార్ ను అభినందించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు... నిందితలను పట్టుకోవటం తో పాటుగా వారిని కోర్టులో హాజరు పరిచే వరకూ వ్యక్తిగతంగా సజ్జనార్ ఈ కేసును పర్యవేక్షించారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ ఆ సమయంలో దేశ వ్యాప్తంగా మహిళలు - విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేసాయి. అందరూ సైబరాబాద్ - తెలంగాణ పోలీసులు ఏం చేస్తారా అనే ఉత్కంఠతో ఎదురు చూసాయి. ఎన్ కౌంట్ తరువాత అదే స్థాయిలో ప్రశంసలు అందాయి.

ఉన్నత స్థానానికి రూట్ క్లియర్..
ఇక, సైబరాబాద్ లో అమ్మాయిల అక్రమ రవాణా- సైబర్ క్రైమ్ నియంత్రణలో సక్సెస్ అయ్యారు. ఇక, తాజాగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. సాధారణంగా ఆర్టీసీ ఎండీగా చేసిన వారు తరువాత డీజీపీ హోదా ఇవ్వటం..డీజీగా నియమించటం ఉమ్మడి రాష్ట్రం నుంచి సాధారణ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మరింత సర్వీసు ఉన్న సజ్జనార్ పోలీసు శాఖలో ఉన్నత హోదాకు వెళ్లటం లో భాగంగానే...ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా నియామకం జరిగిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications