జరిగిందేదో జరిగింది ఇక సీరియస్: దానం ట్విస్ట్, 'టిడిపిలో ఆ కీలక నేతలు వెళ్లిపోతారు'
హైదరాబాద్: జరిగిందేదో జరిగిపోయిందని, ఇక సీరియస్‌గా గ్రేటర్ ఎన్నికల కోసం పని చేద్దామని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ మంగళవారం అన్నారు. టిఆర్ఎస్‌లోకి వెళ్లి విషయమై దానం ఈ రోజు వరకు ఊగిసలాడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దానం తెరాసలో చేరుతారంటూ వారం రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని ఆయన చెబుతున్నారు. కానీ ఊహాగానాలు మాత్రం తగ్గలేదు. అయితే, రెండు రోజుల క్రితం మాత్రం ఆయన అధికార టిఆర్ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా, తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఇక గ్రేటర్ విభజన పంచాయతీ వద్దని, కలసి కట్టుగా పని చేద్దామన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఇక సీరియస్‌గా పని చేద్దామన్నారు.

తెలంగాణలో టిడిపి లేదు: వి హనుమంత రావు
తెలంగాణలో టిడిపి పూర్తిగా ఖాళీ అయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు కీలక నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయి, తమ భవిష్యత్తు వెతుక్కునేందుకు ప్రణాళికలు వేస్తున్నారన్నారు.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌కు జరగనున్న ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో జత కట్టే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. గ్రేటర్‌లో పట్టు సాధించి, కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు యత్నిస్తామన్నారు. హైదరాబాద్‌లో సెటిలర్స్‌కు అండగా తమ పార్టీ నిలుస్తుందన్నారు.
ప్రజలను మభ్యపెట్టేందుకే: భట్టి
ప్రజలను మభ్యపెట్టేందుకే హైదరాబాదులో పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క... కెసిఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చెన్నై వరద బాధితులకు రెండువేల దుప్పట్లు పంపిస్తున్నట్లు చెప్పారు.
బిసి ఓటర్లు, ఓట్ల తొలగింపు అంశం తేలే వరకు గ్రేటర్ ఎన్నికలు నిర్వహించవద్దని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాదుకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. పదేళ్లలో లక్ష కోట్లతో హైదరాబాదును అభివృద్ధి చేశామన్నారు.












Click it and Unblock the Notifications