అరాచకాలకు పాల్పడుతోంది: టి సర్కారుపై దానం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము నిర్వహించిన పాదయాత్రకు అనుమతి నిరాకరణ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పట్ల కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, ఎంఏ ఖాన్, తదితరులతో కలిసి మానవ హక్కుల సంఘానికి సోమవరం ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు స్వీకరించిన హెచ్చార్సీ.. ఫిబ్రవరి 23లోగా ఘటనపై డిజి స్తాయి అధికారితో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపి, సిఎస్‌లకు ఆదేశించింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము శనివారం శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ హెచ్చార్సీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలోని పది జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలపై అరాచకాలకు పాల్పడుతోందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీసులను దుర్వినియోగం చేయలేని, అలా చేస్తే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదా? అని దానం ప్రశ్నించారు. భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవాలనుకుంటే అది భ్రమే అవుతుందని అన్నారు. పాదయాత్ర ఘటనలో అమాయక ఏసిపి, ఇన్‌స్పెక్టర్లని బదిలీ చేశారని అన్నారు. దయచేసి ఇలాంటి ప్రవర్తనను మానుకోవాలని దానం విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్యబద్దంగా చేస్తున్న తమ కార్యక్రమాలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై అవసరమైతే హైకోర్టుకు, సుప్రీం కోర్టు వెళ్తామని అన్నారు. ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసినప్పుడు అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్, రాజ్యసభకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, అయితే పోలీసులు అలాంటిదేమి చేయలేదని దానం అన్నారు.
కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే టిఆర్ఎస్ నేతలకు పదవులు దక్కాయని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తాము పనిలేక పాదయాత్రలను చేస్తున్నామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలు అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే మీకు మంత్రి పదవులు వచ్చాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా పాల్గొన్నావా? అని మంత్రి తుమ్మలపై షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్పందించావా? అని నిలదీశారు. అవసరం లేకపోయినా చెస్ట్ ఆస్పత్రిని కెసిఆర్ సర్కారు తరలిస్తోందని ఆరోపించారు. రోగుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications