కవిత దీక్షపై ఆంక్షలు - కొనసాగుతున్న సస్పెన్స్..!!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షపైన పోలీసులు ఆంక్షలు విధించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్షపైన పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు (శుక్రవారం) ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. దాదాపు అయిదు వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని అనుమతి తీసుకొనే సమయంలోనే స్పష్టం చేసారు. అయితే, ఢిల్లీ వేదికగా కవిత తనకు ఈడీ జారీ చేసిన సమన్లు..తన వైఖరి స్పష్టం చేస్తున్న సమయంలోనే ఢిల్లీ పోలసుల నుంచి సమాచారం అందింది. భద్రతా కారణాల రీత్యా..సగం స్థలంలోనే ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు. లేకుంటే మరో వేదికకు దీక్ష కార్యక్రమం మార్చుకోవాలని పోలీసులు చెప్పటంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ తో కవిత శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షకు నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా 19 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు సమచారం. దీక్ష కోసం ఇప్పటికే కవిత ఢిల్ల చేరుకున్నారు. జంతర్ మంతర్ లో ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే దీక్ష నిర్వహణ పైన పోలీసులు షరతులు విధించటం సమస్యగా మారింది. పది రోజుల క్రితమే పోలీసులు కవిత దీక్షకు అనుమతి ఇచ్చారు. రేపటి దీక్ష కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పోలీసుల నుంచి సమాచారం అందింది. దాదాపు అయిదు వేల మంది దీక్షలో పాల్గొంటారని భావిస్తున్నారు. సీపీఎం నేత సీతారా ఏచూరి ఉదయం దీక్ష ప్రారంభ సమయంలో హాజరై మద్దతు ప్రకటించనున్నారు. ఇతర పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు మద్దతుగా వస్తున్నట్లు తెలుస్తోంది.

జంతర్ మంతర్ వద్ద బీజేపీ నేతలు సభకు దరఖాస్తు చేసుకోవటంతో పోలీసులు తాజాగా ఆంక్షలు విధించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీని పైన బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దీక్షకు అనుమతి వస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి నిరీక్షిస్తున్నారని కవిత చెప్పుకొచ్చారు. యూపిఏ హయాంలో కూటమి ప్రభుత్వం కావటంతో బిల్లు ఆమోదం పొందలేని.. 2014, 2019లో బీజేపీ కూడా మహిళా బిల్లుపైన హామీ ఇచ్చిందని కవిత గుర్తు చేసారు. ఇప్పుడు ఆ డిమాండ్ ను ప్రస్తావిస్తుందుకే తనకు ఈడీ నోటీసులు ఇచ్చి సమయం ఇవ్వకుండా విచారణకు రావాలని నిర్దేశించారని వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు పోలీసులు తాము ఇచ్చిన అనుమతి మేరకు దీక్ష కొనసాగింపుకు అనుమతి ఇస్తారా..లేక ఆంక్షల నడుమ దీక్ష జరుగుతుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications