అక్రమసంబంధం పెట్టుకుందని మహిళను వివస్త్రను చేసి, జననాంగంలో జీడిపోసి పైశాచిక దాడి
వివాహేతర సంబంధం పెట్టుకుంది అన్న ఒక కారణంతో ఒక మహిళను వివస్త్రను చేసి జననాంగంలో జీడీ పోసి అత్యంత దారుణంగా దాడి చేసి వీడియోలను చిత్రీకరించిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. అత్యంత అమానవీయంగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఐదు రోజుల క్రితం జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దాడి తర్వాత వీడియోలు వైరల్ కాగా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై విచక్షణా రహితంగా దాడి
ఇక ఈ ఘటన వివరాలలోకి వెళితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా కొందరు దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది . బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం.

వివాహేతర సంబంధం పెట్టుకున్నారని
తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే అతడు సమీప బంధువైన మరొక వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళతో పదిరోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దీంతో ఆ యువతి తాటికాయల గ్రామానికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పి భర్తను, ఆ యువతిని పట్టుకుంది.
వివస్త్రని చేసి జీడి పోసి కట్టేసి కొట్టిన దారుణం
వారిని తాటికాయల గ్రామానికి తీసుకువచ్చారు. ఆ యువతిని ఒక మంచానికి కట్టేసి వివస్త్రను చేసి జననాంగం పై జీడి పోసి విచక్షణ రహితంగా కొట్టారు. భార్యను వదిలి వెళ్ళిన భర్తను అర గుండు గీసి దాడి చేశారు. శరీరంలోని సున్నితమైన అవయవం పైన జీడి పోసి, రక్తస్రావం అవుతున్నా వదిలిపెట్టకుండా దాడి చేశారు. తప్పు చేసాము క్షమించమని బాధిత మహిళ వేడుకున్నా వదలకుండా దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు.
ఐదు రోజుల క్రితం ఘటన.. ఆచూకీ దొరకని ఇద్దరు
ఆ తరువాత ఆ ఇద్దరిని ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడిచిన తర్వాత వీడియోలు వైరల్ కావడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది ఇప్పటివరకు అంతు చిక్కక పోవడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
వారిపై కేసులు .. పోలీసుల హెచ్చరిక
ఇదే సమయంలో బాధిత మహిళకు సంబంధించిన దాడి వీడియోలను ఎవరైనా వైరల్ చేస్తే వారి పైన ఐటి యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ కేసు పైన తామే విచారణ చేస్తున్నామని, మహిళ వ్యక్తిగత గోప్యత పాటించాలని సూచిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications