ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన డైరెక్టర్ క్రిష్; రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ కూడా ఉన్నట్టు పేర్కొని క్రిష్ ను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాజాగా డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
క్రిష్ మాత్రమే కాదు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘు చరణ్ అట్లూరి, సందీప్ తోపాటు సినీనటి లిషి, శ్వేత, నీల్ తదితరులు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు . టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇటీవల భారీగా కొకైన్ పట్టుకున్న రాడిసన్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది.

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో గత శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద పోలీసులకు పట్టిబడిన విషయం తెలిసిందే. అతనితోపాటు నిర్భర్, కేదార్, డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉండడంతో ఈ కేసులో కొత్తకోణాలు వెలుగు చూశాయి.
ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్టు మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ వెల్లడించారు. అయితే ఆయన కొకైన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న క్రిష్ ను విచారణకు పిలిచిన పోలీసు అధికారులు, ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
అయితే క్రిష్ తాను ముంబైలో ఉన్న కారణంగా పోలీస్ విచారణకు రాలేనని, తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరారు. నేడు క్రిష్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. ఈ క్రమంలోనే క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయించటం ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications